: ప్రతి ఒక్కరినీ అనుమానిస్తారా? నోట్ల రద్దు తప్పుడు నిర్ణయం: మోదీపై నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ విమర్శలు
నరేంద్ర మోదీ ప్రభుత్వం భారత్ లోని ప్రతి ఒక్కరి వద్దా నల్లధనం ఉందన్న అభిప్రాయంతో ఉన్నట్టు తనకు అనిపిస్తోందని నోబెల్ బహుమతి గ్రహీత, ప్రముఖ ఆర్థికవేత్త అమర్త్య సేన్ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్లను రద్దు చేయాలన్న మోదీ ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు. మోదీ నిర్ణయం సామాన్యులకు ఇబ్బందులు పెట్టేదే తప్ప, వ్యవస్థలో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెచ్చేందుకు సహాయపడదని ఓ టీవీ చానల్ తో మాట్లాడిన అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు. ముందస్తు ఏర్పాట్లు, ప్రణాళిక లేకుండా తీసుకున్న ఈ చర్యలతో ప్రజలు కష్టాల్లోకి నెట్టివేయబడ్డట్లయిందని అన్నారు. తమ కష్టార్జితాన్ని వాడుకునేందుకు కూడా ప్రజలు అవస్థలు పడుతున్నారని విమర్శించిన అమర్త్యసేన్, నల్లధనాన్ని వెనక్కు తెస్తామని ఇచ్చిన హామీని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.