: నల్లకుబేరులకు ఒకటే హెచ్చరిక... ఇక ఆటలొద్దు: మోదీ
ఇండియాకు స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి లెక్కలోకి చూపకుండా వేల కోట్ల రూపాయలను దాచుకున్న అక్రమార్కులంతా, ఇకపై అన్ని ఆటలనూ పక్కన బెట్టాలని, డబ్బు దాచుకుంటూ, వృద్ధి విఘాతకులుగా మారుతుంటే, చూస్తూ ఊరుకునే ప్రభుత్వం పోయిందని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. మన్ కీ బాత్ లో భాగంగా ఆయన ప్రసంగిస్తూ, తాను నల్ల కుబేరులకు ఒకేమాట చెప్పదలచుకున్నానని, పేదల జీవితాలతో, దేశ ప్రగతితో ఆటలాడొద్దని అన్నారు. పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత అక్రమార్కులు తమదైన శైలిలో నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకునేందుకు ప్రయత్నించారని, ప్రతి ఒక్కరి కథా తనకు తెలుసునని అన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఖాతాల్లో డబ్బు దాచుకున్న ప్రతి ఒక్కరినీ చట్టం ముందు నిలుపుతామని హెచ్చరించారు.