: జయలలితకు ఫిజియో థెరపీ.. అపోలోకు చేరుకున్న సింగపూర్ రోబో!
గత రెండు నెలలుగా చెన్నైలోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఫిజియో థెరపీ చేసేందుకు సింగపూర్ నుంచి ప్రత్యేకంగా రోబోను తెప్పించినట్టు తెలుస్తోంది. జయ ఇప్పటికే కోలుకున్నారని, మైకు సహాయంతో కొద్దికొద్దిగా మాట్లాడుతున్నారని ఆస్పత్రి చైర్మన్ ప్రతాప్ సి.రెడ్డి తెలిపారు. ఆమె మామూలుగానే శ్వాస తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ఆమె నడవడం కోసం ఫిజయో థెరపీ చేస్తున్నట్టు చెప్పారు. అయితే ఆమెకు మరింత మేలైన ఫిజయోథెరపీ కోసం సింగపూర్ నుంచి ప్రత్యేకంగా రోబోను తెప్పించినట్టు సమాచారం. రోబోటిక్ థెరపీకి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన సింగపూర్‌లోని మౌంట్ ఎలిజబెత్ ఆస్పత్రి నుంచి ఈ రోబోను తెప్పించినట్టు తెలుస్తోంది. రోబోటిక్ థెరపీ సాయంతో జయ మరింత త్వరగా కోలుకుని నడిచే అవకాశం ఉందని ఆస్పత్రి వర్గాలు భావిస్తున్నాయి. మరోవైపు జయలలిత ఆప్తురాలు శశికళ అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయను రాత్రనక, పగలనక కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండడంతో శశికళ కొంత అస్వస్థతకు గురయ్యారని సమాచారం.