: ఇదెక్కడి విడ్డూరం!.. తండ్రిని అరెస్ట్ చేయడం వీలుకాలేదని నాలుగేళ్ల కొడుకును అరెస్ట్ చేసిన పోలీసులు
ఇది నిజంగా విడ్డూరమే. తండ్రిని అరెస్ట్ చేయలేని పోలీసులు అతడి నాలుగేళ్ల కొడుకును అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపారు. తమిళనాడులోని అరక్కోణంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. మేల్ఆవత్తం గ్రామానికి చెందిన వేదగిరి(35) సారా వ్యాపారం చేస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. గతంలోనూ ఆయనపై ఇందుకు సంబంధించిన కేసులు ఉన్నాయి. సారా వ్యాపారంపై సమాచారం అందుకున్న పోలీసులు వేదగిరిని అరెస్ట్ చేసేందుకు వెళ్లారు. అయితే ఆ సమయంలో అతడు ఇంట్లో లేడు. దీంతో పోలీసులు వేదగిరి భార్య సంగీతను కలిసి భర్త గురించి ఆరా తీశారు. అతడు ఇంట్లో లేడని, తాను ఇప్పుడే కొడుకును స్కూలు బస్సులో ఎక్కించి వస్తున్నానని తెలిపింది. అంతే, పోలీసులు అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయి స్కూలు బస్సును వెంబడించి మరీ వేదగిరి కుమారుడిని అదుపులోకి తీసుకున్నారు. విషయాన్ని సంగీతకు చెప్పి భర్తను తీసుకొస్తేనే కొడుకును ఇస్తామంటూ కిడ్నాపర్లలా మాట్లాడారు. పోలీసుల సమాచారంతో కలత చెందిన సంగీత వెంటనే స్కూలుకు చేరుకుని, స్కూలుకు పంపిన కుమారుడిని పోలీసులకు ఎలా అప్పగిస్తారని నిలదీసింది. దీనికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందంటూ వాగ్వాదానికి దిగింది. దీంతో స్కూలు యాజమాన్యం వెంటనే పోలీస్ స్టేషన్‌కు చేరుకుని బాలుడిని రక్షించి ఆమెకు అప్పగించింది. పోలీసుల తీరుపై తనకు ఫిర్యాదు అందిందని, విచారణ జరపాల్సిందిగా ఆదేశించానని డీఐజీ తమిళరసన్, ఎస్పీ పలగవన్‌లు తెలిపారు.