: జగన్‌పై తీవ్రస్థాయిలో మండిపడిన చంద్రబాబు .. ఈసారి ఆ పార్టీకి సింగిల్ డిజిట్టేనని జోస్యం
ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దివాలాకోరుతనం ప్రదర్శిస్తోందని, నేరాలు ఘోరాలు చేసే ఆ పార్టీ నాయకుడిని ప్రజలు నమ్మరని ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆయన నీతులు చెబితే వినే పరిస్థితిలో ప్రజలు లేరని పరోక్షంగా జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. శనివారం కడప, రాజంపేటలలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ లక్ష కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయన ప్రభుత్వం చేసే మంచిపనులను చూసి సహించలేకపోతున్నారని విమర్శించారు. ప్రతి అభివృద్ధి పనిని అడ్డుకోవడమే ఆయన లక్ష్యమని ఆరోపించారు. తాజాగా దివీస్ లేబొరేటరీపై విషం కక్కుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్‌లో ఆ పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదని జోస్యం చెప్పారు. ఆయన నాయకత్వంపై పార్టీలో నమ్మకం లేదన్నారు.శుక్రవారం వైసీపీ ఎమ్మెల్యేలు తన వద్దకు వచ్చి అభివృద్ధికి నిధులు కావాలని అడిగారని, నేనే అభివృద్ధి చేస్తుంటే ప్రత్యేకంగా మీకు నిధులు ఎందుకు అని ప్రశ్నించానని చంద్రబాబు తెలిపారు.