: క్యాస్ట్రో మృతిపై కసిగా స్పందించిన ట్రంప్.. క్యూబా ప్రజలకు స్వాతంత్ర్యం వచ్చిందని ట్వీట్
కమ్యూనిస్ట్ యోధుడు, క్యూబా మాజీ అధినేత ఫిడెల్ క్యాస్ట్రో మృతిపై అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ దారుణంగా స్పందించారు. తొలుత 'క్యాస్ట్రో మృతి చెందారు'.. అంటూ ఎటువంటి భావోద్వేగం లేకుండా సాదాసీదాగా ట్వీట్ చేసిన ట్రంప్ తర్వాత మరో ట్వీట్‌లో దారుణంగా వ్యాఖ్యానించారు. క్యాస్ట్రోను నియంతగా అభివర్ణించారు. సొంత ప్రజలను ఆరు దశాబ్దాల పాటు అణచివేసిన వ్యక్తి అని పేర్కొన్నారు. అతని పాలనలో క్యూబా ఇన్నాళ్లూ మగ్గిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల స్వేచ్ఛావాయువులను ఆయన హరించారని, ప్రజలు చెప్పలేని బాధలు అనుభవించారని పేర్కొన్నారు. ఇక వారికి స్వాతంత్ర్యం వచ్చినట్టేనని, స్వేచ్ఛగా జీవిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇందుకోసం తమ ప్రభుత్వం పూర్తి సహాయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు. ట్రంప్ ట్వీట్‌పై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది.