: తాడేపల్లి గూడెంలో అమిత్ షాకు నాగలి, మేకపిల్ల బహూకరణ
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ నిర్వహించతలపెట్టిన రైతు మహాసభ ప్రారంభమైంది. ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్‌షాతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, నిర్మలా సీతారామన్, పలువురు రాష్ట్ర మంత్రులు, బీజేపీ నేతలు ఈ సభలో పాల్గొన్నారు. రైతులు, బీజేపీ కార్యకర్తలు సభకు హాజరయ్యారు. ఈ సందర్భంగా అమిత్ షాకు అక్కడి రైతులు నాగలి, మేకపిల్ల బహూకరించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ... సమాజంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరగాలన్నదే ప్రధాని మోదీ లక్ష్యమని చెప్పారు. యూరియా నల్లబజారుకు తరలకుండా ప్రధాని మోదీ పటిష్ట చర్యలు తీసుకున్నారని అన్నారు. ప్రజలకి మేలు చేసేందుకే ఎన్నో నిర్ణయాలతో ముందుకు వెళుతున్నామని చెప్పారు. అతివృష్టి అయినా, అనావృష్టి అయినా దాని ప్రభావం అధికంగా రైతుల మీదే ఉంటుందని ఆయన అన్నారు. రైతులు కష్టాలు పడకుండా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇక్కడి రైతులను కలవడం తనకు ఎంతో సంతోషాన్నిస్తోందని అన్నారు.