: క్యాస్ట్రోపై 638 సార్లు హత్యాయత్నం చేసిన అమెరికా!
ప్రపంచ ప్రఖ్యాత కమ్యూనిస్టు యోధుడు, క్యూబా మాజీ అధ్యక్షుడు ఫిడెల్ క్యాస్ట్రో ఈ రోజు తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఐదు దశాబ్దాల పాటు క్యూబాను పాలించిన క్యాస్ట్రో... పక్కనే ఉన్న అగ్రరాజ్యం అమెరికాకు ప్రశాంతత లేకుండా చేశాడు. ఆయన సుదీర్ఘ పాలనా సమయంలో అమెరికాలో తొమ్మిది మంది అధ్యక్షులు మారిపోయారు. యూఎస్ అధ్యక్షుడు ఎవరైనా సరే, వారి లక్ష్యం ఒకటే... క్యాస్ట్రోని గద్దె దించడం లేదా మట్టుబెట్టడం! క్యూబాలో అప్పటిదాకా తమకు అనుకూలంగా ఉన్న సైనిక ప్రభుత్వాన్ని కూల్చివేయడంతో క్యాస్ట్రోపై అమెరికాకు ఆగ్రహం కలిగింది. దీనికి తోడు, క్యూబాను కమ్యూనిస్టు దేశంగా మార్చి, దేశంలోని అమెరికా కంపెనీలన్నింటినీ జాతీయం చేశాడు క్యాస్ట్రో. దోంతో అమెరికాకు పుండు మీద కారం చల్లినట్టైంది. అప్పట్నుంచి క్యాస్ట్రోను మట్టుబెట్టాలని ప్రయత్నిస్తూనే వచ్చింది. దాదపు 638 సార్లు క్యాస్ట్రోను అంతం చేసేందుకు అమెరికా యత్నించిందంటే... క్యాస్ట్రో ఉనికిని అమెరికా ఏ రేంజ్ లో తట్టుకోలేకపోయిందో అర్థమవుతుంది. తన గూఢచార విభాగం సీఐఏ ద్వారా అమెరికా హత్యాయత్నాలను చేసేది. అన్ని ప్రయత్నాల్లోకెల్లా క్యాస్ట్రో మాజీ భార్య మారిటా లారెంజ ద్వారా జరిగిన హత్యా యత్నాన్ని ప్రత్యేకమైనదిగా చెప్పుకుంటారు. సీఐఏ అందించిన విషం నింపిన మందుబిళ్లలతో తన భర్త క్యాస్ట్రోను చంపడానికి ఆమె ప్రయత్నించింది. ఈ విషయాన్ని పసిగట్టిన క్యాస్ట్రో ఆమెపై తుపాకీ ఎక్కుపెట్టాడు. అయితే, ఈ పని తాను కావాలని చేయలేదని... సీఐఏ ప్రయత్నమని చెప్పడంతో... ఆమెను ప్రాణాలతో వదిలి పెట్టాడు క్యాస్ట్రో. మరోసారి పెన్నులాంటి ఇంజెక్షన్ తో ఆయన శరీరంలోకి అత్యంత ప్రమాదకర విషాన్ని ప్రయోగించాడు ఓ ఆగంతుకుడు. అయినా క్యాస్ట్రో బతికాడు. 1960లో ఐక్యరాజ్య సమావేశాలకు క్యాస్ట్రో వెళ్లినప్పుడు... పేలుడు పదార్థంతో నింపిన సిగార్ ఆయకు ఇచ్చాడు ఓ పోలీస్ అధికారి. దాన్ని పసిగట్టిన క్యాస్ట్రో సిగార్ తాగలేదు. ఒకవేళ దాన్ని వెలిగించి ఉంటే... అతని జీవితం అక్కడే అంతమయ్యేది. స్కూబా డైవ్ సూట్ లో పేలుడు పదార్థాలు నింపి ఒకసారి, డైవ్ సూట్ లో ప్రమాదకర బ్యాక్టీరియా నింపి మరోసారి, హ్యాండ్ కర్చీఫ్ లో అత్యంత ప్రమాదకర బ్యాక్టీరియా నింపి ఇంకోసారి... ఇలా ఎన్నో రకాలుగా క్యాస్ట్రోను చంపడానికి అమెరికా ప్రయత్నించింది. ఇంకో ఆసక్తికర విషయం ఏమిటంటే... ప్రజల్లో ఆయనకు అంత ఆదరణ ఉండటానికి ఆయనకున్న గడ్డం కూడా ఒక కారణమని సీఐఏ అధికారులు భావిస్తుండేవారు. దీంతో, ఆయన గడ్డాన్ని ఊడగొట్టేందుకు కూడా అమెరికా ప్రయత్నించింది. థాలియం లవణం కలిపిన పౌడర్ ను ఆయనపై ప్రయోగించింది. ఈ పౌడర్ తాగినా, పీల్చినా, చర్మంపై పడినా మొత్తం జుట్టు, గడ్డం ఊడిపోతాయి. అయినా, ఈ ప్రయత్నం కూడా క్యాస్ట్రోను ఏమీ చేయలేకపోయింది.