: పెళ్లికి 4 గంటల ముందు పెళ్లికూతురిపై యాసిడ్ దాడి.. అయినప్పటికీ పెళ్లి జరిపించారు!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో ఓ పెళ్లింట విషాదం చోటుచేసుకుంది. పెళ్లికి 4 గంటల ముందు పెళ్లి కూతురిపై ఓ మహిళ యాసిడ్ దాడి చేసింది. అయినప్పటికీ పెళ్లి ఆగకూడదనే ఉద్దేశంతో ఆ తంతును పూర్తి చేయాలని ఆమె కుటుంబసభ్యులు నిర్ణయించుకున్నారు. యాసిడ్ దాడికి గురవడంతో గాయాలపాలయిన పెళ్లికూతురిని ఆమె కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయించి మళ్లీ ఇంటికి తీసుకొచ్చి పెళ్లి జరిపించారు. అనంతరం తిరిగి ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆ అమ్మాయిపై నిన్న రాత్రి 11:30 గంటలకు ఓ మహిళ యాసిడ్ పోసింది. ఈ రోజు తెల్లవారుజామున 3 గంటలకు ముందుగా నిర్ణయించిన ముహూర్తం మేరకు ఆమె పెళ్లి జరిగింది. ఘటనపై మీడియాకు పోలీసులు వివరాలు చెబుతూ ఫంక్షన్ హాల్ లో జరుగుతున్న వివాహానికి ఓ మహిళ వచ్చి పెళ్లికూతురిని కలిసిందని చెప్పారు. వారిరువురు కాసేపు మాట్లాడుకున్నారని, అయితే ఆ మహిళ ఒక్కసారిగా పెళ్లికూతురి ముఖంపై యాసిడ్ తో దాడి చేసి, అనంతరం వధువు ఉన్న గదికి తాళం వేసి అక్కడి అక్కడి నుంచి పరారయిందని చెప్పారు. వధువుకి తీవ్రగాయాలయ్యాయని, రూములో నుంచి వస్తోన్న వధువు అరుపులు విన్న ఆమె బంధువులు గది తలుపులు బద్దలు కొట్టి, వెంటనే అక్కడి నుంచి దగ్గరలోని ఆసుపత్రికి తరలించగా, ఆమె ముఖం, కళ్లపై పడిన యాసిడ్ గాయాలకు వైద్యులు ప్రాథమిక చికిత్స అందించారని చెప్పారు. సీసీటీవీ ఫుటేజి ఆధారంగా నిందితురాలిని గుర్తించే దిశగా పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఆ మహిళ యాసిడ్ దాడి ఎందుకు చేసిందనే అంశంపై ఆరా తీస్తున్నారు. సదరు నిందితురాలి తండ్రి భారత ఆర్మీలో పనిచేస్తున్నాడు. మరోవైపు పెళ్లికొడుకు కూడా ఆర్మీలో సైనికుడు.