: 49 కోట్ల మంది కార్మికులకు జన్‌ధన్ ఖాతాలు.. వాటి ద్వారానే జీతాలు: దత్తాత్రేయ
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ ఈ రోజు తిరుపతిలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన తిరుమల శ్రీవారిని కుటుంబసభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం దత్తన్నకు టీటీడీ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం తీసుకున్న రూ.500, 1000 నోట్ల రద్దు ఓ విప్లవాత్మక నిర్ణయమని పేర్కొన్నారు. గతంలో మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ వంటి వారికి కూడా ఇటువంటి పని చేయడం సాధ్యం కాలేదని, ఇప్పుడు నరేంద్ర మోదీ చేసి చూపిస్తున్నారని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు. దేశంలో కొత్తగా 49 కోట్ల మంది కార్మికులకు జన్‌ధన్ అకౌంట్లు తెరుస్తామని పేర్కొన్నారు. ఇకపై కూలీలకు కాంట్రాక్టర్లు ఆ ఖాతాల ద్వారానే జీతాలు చెల్లించేలా చూస్తామని అన్నారు. తమ ప్రభుత్వం 'జాతీయ కనీస వేతన చట్టం' తీసుకురానుందని చెప్పారు.