: సుమారు 500 జడ్జీల పోస్టులు ఖాళీ... ఎప్పుడు భర్తీ చేస్తారు?: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మండిపాటు
హైకోర్టుల్లో న్యాయాధికారుల నియామకంలో కేంద్ర ప్రభుత్వ అలసత్వంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేశారు. హైకోర్టుల్లో 500 వరకు న్యాయాధికారుల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అవి ఎప్పుడు భర్తీ అవుతాయని ప్రశ్నించారు. న్యాయస్థానాల్లో నియామకాలు జరగలేదని తాను వ్యాఖ్యానించడం లేదని, కేంద్ర ప్రభుత్వం ఇప్పటికి 121 మందిని నియమించిందని, అయినప్పటికీ అధిక సంఖ్యలో ప్రతిపాదనలు పెండింగులోనే ఉన్నాయని అన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెడుతుందని తాను భావిస్తున్నట్టు పేర్కొన్నారు. పలు విభాగాల్లో ఛైర్మన్‌లు లేని విషయం గురించి టీఎస్ ఠాకూర్ వివరిస్తూ.. అడ్వాన్స్ రూలింగ్, సాయుధ దళాల అప్పిలేట్ ట్రైబ్యునల్, కాంపిటీషన్ కమిషన్‌లకు చైర్మన్‌లు లేరని చెప్పారు. పలువురు ఈ హోదాలను స్వీకరించడానికి నిరాకరిస్తున్న మాట నిజమేనని, దానికి కారణం కేంద్ర సర్కారు చైర్మన్లు కూర్చోడానికి గౌరవప్రదమైన స్థానం కూడా కల్పించలేకపోతోందని వ్యాఖ్యానించారు. ఇప్పటికే తాను ఈ అంశంపై సర్కారుకి లేఖ రాశానని చెప్పారు. అందులో తాను కొన్ని సూచనలు చేశానని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులను కూడా ఛైర్మన్‌గా నియమితం కావడానికి అర్హులుగా చేయాలని చెప్పానని అన్నారు. టీఎస్ ఠాకూర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్.. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై తమకు ఎంతో గౌరవం ఉందని అన్నారు. అయితే, న్యాయమూర్తుల నియామకంలో ఆయన చేసిన వ్యాఖ్యలను అంగీకరించలేమని, ఇప్పటికే తాము 120 మంది హైకోర్టు న్యాయాధికారుల నియామకాలు పూర్తి చేశామని అన్నారు.