: ఉడతలు పగబట్టాయి.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నా: ఓ రాజకీయ నాయకుడి విచిత్ర బాధ
దర్శకుడు రాజమౌళి సినిమాలో నాని అనే ఈగ విలన్ పై పగబట్టి ముప్పుతిప్పలు పెట్టిన సంగతి తెలిసిందే. అయితే, అటువంటి మూగప్రాణులు నిజజీవితంలోనూ మనుషులపై పగబడతాయని చెబుతున్నాడు అమెరికాలోని ఓ రాజకీయ నాయకుడు. దానికి తానే ఓ ఉదాహరణ అని వ్యాఖ్యానించారు. ఓ ఉడత తనపై దాడి చేస్తోందని సూసైడ్ బాంబర్‌గా మారి తనను ముప్పుతిప్పలు పెడుతోందని చెప్పారు. ఈ దేశంలో చికాగోలోని 21వ వార్డుకు కార్పొరేటర్‌గా ఉన్న హావర్డ్ బ్రూకిన్స్ జూనియర్ ఈ వ్యాఖ్యలు చేశారు. గతనెలలో తాను ఉడతలపై పలు వ్యాఖ్యలు చేసినందుకుగానూ అవి పగబట్టి మరీ నగరంలోని చెత్తకుండీలను సర్వనాశనం చేస్తున్నాయని వ్యాఖ్యానించాడు. దీంతో సర్కారుకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని చెప్పాడు. వాటిని అరికట్టాలని ఆదేశాలు జారీ చేశాడు. ఈ నెల 13వ తేదీన ఆయన సైకిల్‌పై ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా వచ్చిన ఓ ఉడత ఆయన కాలును కరవడంతో అదుపుతప్పి పడిపోయి గాయాలపాలయ్యాడు. ఈ ఘటనలో ఉడత మృతి చెందింది. బ్రూకిన్స్ కి గాయాలు కాగా ఆసుపత్రిలో పలు టెస్టులు చేయాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలోనే ఆయన ఇటువంటి విచిత్ర వ్యాఖ్యలు చేశారు. తాను ఉడతలకు వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యల పర్యవసానంగానే అవి తనపై పగబట్టాయని, ఉడత చేసిన దాడిలో ఇప్పుడు పూర్తిగా కోలుకున్నానని, అయితే తాను విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచించారని పేర్కొన్నారు. పలు కార్యక్రమాలకు హాజరుకాలేపోతున్నందుకు తనను క్షమించాలని ఆయన ఫేస్‌బుక్ ద్వారా తెలిపారు.