: నల్లధనం చెదపురుగులా దేశాన్ని తొలిచేస్తోంది.. ప్రధాని మోదీ ఆవేదన
నల్లధనం దేశాన్ని చెదపురుగులా తొలిచేస్తోందని, జాతి హితం కోసమే పెద్ద నోట్లను రద్దు చేయాల్సి వచ్చిందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. అవినీతి, నల్లధనం సామాన్యుల శ్రమను లూటీ చేస్తున్నాయని, పేద, మధ్య తరగతి ప్రజల హక్కులను పూర్తిగా కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ఢిల్లీలోని పార్లమెంట్ హౌస్‌లో జరిగిన పుస్తకావిష్కరణలో పాల్గొన్న మోదీ మాట్లాడుతూ నోట్ల రద్దును పూర్తిగా సమర్థించుకున్నారు. నోట్ల రద్దుకు సంబంధించి ప్రభుత్వం పూర్తిస్థాయిలో సన్నద్ధం కాలేదన్న విమర్శలను కొట్టిపడేశారు. పేద, మధ్యతరగతి వారి హక్కులను తిరిగి ఇవ్వాలని నిర్ణయించుకున్నానని పేర్కొన్నారు. ఇకపై వారు దోపిడీకి గురికాకుండా చూస్తానని హామీ ఇచ్చారు. అవినీతిలో దేశం ముందు వరుసలో ఉన్నట్టు పలు అంతర్జాతీయ సర్వేల్లో వెల్లడైందని, ఆ అప్రతిష్ఠను తొలగించేందుకే జాతి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ఇటువంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వివరించారు. నకిలీ కరెన్సీ యువతను నాశనం చేస్తోందని, దాన్ని అరికట్టి వారిని రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని మోదీ స్పష్టం చేశారు. ప్రపంచ దేశాల్లో భారత్ తలెత్తుకునేలా చేసేందుకే నోట్లను రద్దు చేశామని, ఈ యజ్ఞానికి ప్రతి ఒక్కరు సహకరించాలని కోరారు. నవంబరు 8కి ముందు చాలా నగరాల్లో రూ.3500 కోట్ల పన్నులు వసూలైతే, నోట్ల రద్దు ప్రకటన తర్వాతి నుంచి ఇప్పటి వరకు రూ.13 వేల కోట్ల పన్నులు వసూలైనట్టు ప్రధాని వివరించారు.