: వచ్చే రెండు వారాల్లో సమస్యలు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు: ఆర్బీఐ
ఈ నెల 8వ తేదీ రాత్రి ఎనిమిది గంటల ముప్ఫై నిమిషాల సమయంలో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోదీ చేసిన ప్రకటనను ఎవరూ మర్చిపోలేరు. ఈ ప్రకటన వెలువడే నాటికే నెలలోని ఎనిమిది రోజులు గడిచిపోయాయి. అప్పటికే, బ్యాంకులు, ఏటీఎంల నుంచి ఉద్యోగులు, పింఛన్ దారులు చాలా మంది నగదు డ్రా చేసుకున్నారు. ఇక పెద్ద నోట్ల రద్దు ప్రకటన అనంతరం ఆ నోట్ల మార్పిడికి, చిన్న నోట్ల కోసం ప్రజలు ఎంతగా ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా ప్రస్తావించనక్కర్లేదు. ఇప్పటికీ... బ్యాంకులు, ఏటీఎంల ద్వారా సరిపడా నగదు లభించని పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో... మరో ఐదు రోజుల్లో ఈ నెల ముగియనుంది. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు జీతాలందుకోనున్నారు. బ్యాంకులు, ఏటీఎంలు ఏ విధంగా కిక్కిరిసిపోతాయనే విషయాన్ని తలచుకుంటేనే చాలా మందికి భయం పుడుతోంది. ఈ నేపథ్యంలో, వచ్చే రెండు వారాల్లో సమస్యలు తలెత్తకుండా ఉండేలా చూస్తామని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రకటించింది. ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ ఎస్ఎస్ ముంద్రా ఆధ్వర్యంలో ఓ క్రాక్ టీమ్ ఏర్పాటయిందని, వచ్చే రెండు వారాల్లో తలెత్తబోయే సమస్యలపై పరిష్కరాల కోసం ఈ టీమ్ ముందస్తుగా ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. నవంబర్ 27 నుంచి డిసెంబర్ 7 మధ్య కాలంలో ఎక్కువగా దృష్టి సారించాలని ముంద్రా ఆధ్వర్యంలోని ఆర్బీఐ టాస్క్ ఫోర్స్ నిర్ణయించింది. ఈ టాస్క్ ఫోర్స్ లో ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖ, ఆర్బీఐ, బ్యాంకులు, నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ అధికారులు తదితరులు ఉన్నట్లు పేర్కొన్నారు. నగరాలు, పట్టణాల్లో నిర్దేశిత ప్రాంతాలను నిర్ణయించి, అవసరమైన నగదును పంపించాలని, ఏటీఎంల వద్ద క్యూలను ఎలా తట్టుకోవాలనే విషయాలపై ప్యానెల్ సభ్యులు చర్చించి నిర్ణయిస్తారని అన్నారు. సాధారణంగా వేతనాల చెల్లింపుల సమయం ప్రతి నెల 29వ తేదీ నుంచి ఆ తర్వాతి నెల 5వ తేదీ వరకు ఉంటుందని, ఆ కాలంలో నగదు విత్ డ్రాలు ఎక్కువగా జరుగుతాయని అధికారులు చెబుతున్నారు.