: ర్యాంకింగ్స్‌లో 2 స్థానాలు మెరుగుపర్చుకున్న సింధు.. 5 స్థానాలు కోల్పోయిన సైనా
హాంకాంగ్ సూపర్‌సిరీస్‌లో భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగుతేజం పీవీ సింధు అద్భుతంగా రాణిస్తూ సెమీస్‌కు చేరుకున్న సంగతి తెలిసిందే. మంచి ఫాంలో ఉన్న ఆమె తాజాగా ప్రకటించిన ప్రపంచ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్‌లో రెండు స్థానాలు మెరుగుపరుచుకుంది. ఇప్పటివరకు 11వ ర్యాంకులో ఉన్న సింధు ఇప్పుడు 9వ ర్యాంకుకు చేరుకుంది. మరోవైపు ఇప్పటివరకు ఆరో స్థానంలో ఉన్న మరో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ఐదు స్థానాలు కోల్పోవడంతో 11 స్థానంలో నిలిచింది. దీంతో ప్రస్తుతం సైనా కంటే సింధు మెరుగైన ర్యాంకులో కొనసాగుతోంది. ఇటీవల జరిగిన చైనా ఓపెన్‌లో సైనా నెహ్వాల్ రెండో రౌండ్లో ఓటమి పాలయిన విషయం తెలిసిందే. దీంతో ఆమె ఐదు స్థానాలు కోల్పోయింది. మరోవైపు సూపర్ సిరీస్ ర్యాంకింగ్స్‌లో సింధు 10వ స్థానంలో ఉంటే సైనా 11వ స్థానంలో ఉంది. హాంకాంగ్ సూపర్ సిరీస్‌లో క్వార్టర్ ఫైనల్‌కి చేరిన సైనా నెహ్వాల్ మరికాసేపట్లో చైనా క్రీడాకారిణి చెంగ్ యి తో జరిగే తలపడనుంది. ఇప్పుడు భారత అభిమానుల దృష్టి ఈ ఆటపైనే ఉంది. ఎందుకంటే, సైనా విజయం సాధిస్తే, ఇప్పటికే సెమీస్‌లో అడుగుపెట్టిన సింధుతో తలపడాల్సి ఉంటుంది. ఇద్దరు భారత క్రీడాకారిణుల మధ్య పోటీ నెలకొంటే వారిలో ఎవరు గెలిచి ఫైనల్ కు చేరుతారన్న ఉత్కంఠ ఉంది.