: నియోజకవర్గాలు పెరగవని కేంద్ర స్పష్టం చేసినా... పెరుగుతాయంటున్న టీఆర్ఎస్ ఎంపీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాలను ఇప్పటికిప్పుడు పెంచే ప్రసక్తే లేదని పార్లమెంటు సాక్షిగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి హన్స్ రాజ్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 170 ప్రకారం 2026 వరకు నియోజకవర్గాల పునర్విభజనను చేపట్టరాదంటూ గతంలోనే పార్లమెంటులో బిల్లును పాస్ చేశారని... దీంతో, ఇప్పుడు ఏపీ, తెలంగాణల్లో కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలంటే ఆర్టికల్ 170ని సవరణ చేయాల్సి ఉంటుందని.. ఈ క్రమంలో, ఇప్పటికిప్పుడు ఇది సాధ్యం కాదని ఆయన తేల్చి చెప్పారు. కేంద్ర హోం శాఖ ప్రకటనతో ఇరు రాష్ట్రాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. ఈ నేపథ్యంలో, టీఆర్ఎస్ ఎంపీ వినోద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డప్పుడు ఆర్టికల్ 4 కింద శాసనసభ స్థానాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తప్పని సరిగా తెలుగు రాష్ట్రాల్లో శాసనసభ నియోజకవర్గాలు పెరుగుతాయని చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే రాజ్యాంగ సవరణ ద్వారా అసెంబ్లీ స్థానాలను పెంచాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కేంద్ర ప్రభుత్వం ఇంత స్పష్టంగా చెప్పినప్పటికీ... ఎంపీ వినోద్ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుండటం గమనార్హం.