: తనపై వచ్చిన బాల్‌ ట్యాంపరింగ్‌ ఆరోపణలపై స్పందించిన విరాట్ కోహ్లీ


టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్‌, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐసీసీ నిబంధనల‌కు విరుద్ధంగా బాల్ ట్యాంపరింగ్‌కు పాల్ప‌డ్డాడ‌ని బ్రిటీష్ మీడియా క‌థ‌నాలు ప్రచురించిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల భార‌త్‌-ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌ల మ‌ధ్య రాజ్‌కోట్‌ వేదికగా జ‌రిగిన‌ తొలి టెస్టు మ్యాచులో కోహ్లీ ఈ చ‌ర్య‌కు పాల్ప‌డ్డాడ‌ని సదరు మీడియా ఆరోప‌ణ‌లు గుప్పించింది. ఈ అంశంపై కోహ్లీ ఘాటుగా స్పందించాడు. ఇంగ్లండ్‌తో టీమిండియా ఆడుతున్న‌ సిరీస్‌పై దృష్టి మళ్లించేందుకే ఇటువంటి క‌థ‌నాలను ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించాడు. మొహాలీలో కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ... త‌న‌కు వార్తా ప‌త్రిక‌లు చదివే అలవాటు లేదని అన్నాడు. తాను బాల్‌ ట్యాంపరింగ్‌కు పాల్పడ్డానని పేర్కొంటూ ఒక వార్తా ప‌త్రిక‌లో ప్ర‌చురించిన క‌థ‌నం గురించి తన‌కు లేటుగా తెలిసింద‌ని అన్నాడు. అది చూసి తాను మొదట నవ్వుకున్నాన‌ని అన్నాడు. ఆలోచించి చూస్తే ఇరు జ‌ట్ల మ‌ధ్య ఎంతో ఉత్కంఠ‌తో కొన‌సాగుతున్న‌ సిరీస్‌పై నుంచి దృష్టిని మరల్చేందుకే వారు ఇలాంటి వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నార‌ని అర్థం అవుతుందని వ్యాఖ్యానించాడు. ఈ అంశంపై ఇంగ్లండ్ ఆట‌గాళ్లు కానీ, అంపైర్లుగానీ ఎటువంటి ఫిర్యాదులు చేయ‌లేదు. ఈ విష‌యాన్ని గుర్తు చేసిన కోహ్లీ వార్తా ప‌త్రిక‌లో వ‌చ్చిన‌ కథనం ఆధారంగా ఐసీసీ తనపై చర్యలు తీసుకునే అవ‌కాశం లేద‌ని తాను అనుకుంటున్న‌ట్లు చెప్పాడు. బ్రిటీష్ వార్తా పత్రిక ‘ది డైలీ మెయిల్‌’ కోహ్లీ బాల్ ట్యాంప‌రింగ్‌కు పాల్పడ్డాడ‌ని, త‌మ వ‌ద్ద ఇందుకు సంబంధించిన‌ వీడియో ఆధారాలు కూడా ఉన్నాయ‌ని ఎంతో లేటుగా.. విశాఖపట్నంలో రెండో టెస్టు మ్యాచు కూడా జరిగిన అనంతరం ఈ క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఈ అంశంపై టీమిండియా కోచ్‌ అనిల్‌ కుంబ్లే, టీమిండియా మాజీ ఆట‌గాడు వీరేంద్ర సెహ్వాగ్ తో పాటు ప‌లువురు క్రికెటర్లు స్పందించి ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సంగ‌తి తెలిసిందే. కాగా, ఈ అంశంపై ఐసీసీ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

  • Loading...

More Telugu News