: ఏడాది పాటు నదిలో మునిగిపోయినా చక్కగా పని చేస్తున్న ఐఫోన్


సాధారణంగా కొంచెం ఎత్తు నుంచి కిందకు పడినా, రెండు చుక్కల నీరు లోపలకు వెళ్లినా స్మార్ట్ ఫోన్లు హ్యాంగ్ అవుతుంటాయి. అలాంటిది ఏకంగా ఓ ఏడాది పాటు నదిలో మునిగిపోయిన ఫోన్ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కానీ, ఆ ఫోన్ చాలా అద్భుతంగా పనిచేస్తూ, ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. వివరాల్లోకి వెళ్తే, అమెరికాలోని పెన్సిల్వేనియా రాష్ట్రానికి చెందిన మైఖేల్ అనే వ్యక్తి ఏడాది క్రితం ఓ నదిలో ఫిషింగ్ చేస్తుండగా, అతని ఐఫోన్-4 జారి నీళ్లలో పడింది. ఎంతవెతికినా అది దొరకలేదు. అయితే, సరిగ్గా ఏడాది తర్వాత డేనియల్ అనే మెకానికల్ ఇంజినీర్ కి ఆ ఫోన్ దొరికింది. మైఖేల్ ఫోన్ పోగొట్టుకున్న నదిలో ట్రెజర్ హంట్ చేస్తుండగా... నీటి అడుగున బురదలో చిక్కుకుపోయిన ఐఫోన్ మెటల్ డిటెక్టర్ కు దొరికింది. దాన్ని ఇంటికి తీసుకెళ్లి, క్లీన్ చేసి, బియ్యం సంచిలో పెట్టాడు డేనియల్. ఆ తర్వాత రెండు రోజుల పాటు ఛార్జింగ్ పెట్టడంతో, ఫోన్ చక్కగా పనిచేయడం ప్రారంభించింది. అనంతరం, అందులో ఉన్న నంబర్ల సహాయంతో, మైఖేల్ ఆచూకీ తెలుసుకున్నాడు డేనియల్. జరిగిన విషయాన్నంతా వివరించాడు. పోయిందనుకున్న ఫోన్ దొరకడమే కాకుండా, బాగా పని చేస్తుండటంతో మైఖేల్ ఆనందంలో మునిగిపోయాడు.

  • Loading...

More Telugu News