: మలయాళ హీరో హీరోయిన్ల ప్రేమ కథకు శుభం కార్డు... పొద్దున్నే పెళ్లి చేసుకున్న కావ్యా మాధవన్, దిలీప్
మలయాళ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా వెలుగుతున్న కావ్యా మాధవన్, హీరో దిలీప్ లు ఈ ఉదయం కొచ్చిలోని ఓ హోటల్ లో వివాహం చేసుకున్నారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ జంటను మాలీవుడ్ మురిపెంగా 'లివింగ్ లైలా మజ్ను'గా పిలుచుకుంటుందన్న సంగతి తెలిసిందే. కొంతమంది దగ్గరి బంధువులు, మిత్రుల సమక్షంలో వీరి వివాహం నిరాడంబరంగా సాగింది. కాగా, వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే. 1998లో హీరోయిన్ మంజూ వారియర్ ను పెళ్లి చేసుకున్న దిలీప్, ఆమెకు విడాకులివ్వగా, తన కెరీర్ జోరు మీదున్న సమయంలో 2009లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను వివాహం చేసుకున్న కావ్య, ఏడాదిలోపే విడాకులు ఇచ్చింది. ఆపై వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని ఎన్నో కథనాలు వచ్చాయి. కాగా, ఈ పెళ్లికి దిలీప్ కుమార్తె సైతం అభ్యంతరం పెట్టలేదని తెలుస్తోంది. కావ్యా, దిలీప్ ల జోడీ ఇంతవరకూ 21 సినిమాల్లో కలిసి నటించగా, అందులో ఎన్నో సూపర్ హిట్స్ ఉన్నాయి.