: ఐఏఎస్ అధికారి డీకే రవిది ఆత్మహత్యే!... సీబీఐ నిర్ధారణ
దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ఐఏఎస్ అధికారి డీకే రవి అనుమానాస్పద మృతిపై సీబీఐ దర్యాప్తు పూర్తయింది. రవి మృతి ఆత్మహత్యే అని సీబీఐ తేల్చింది. మరో రెండు రోజుల్లో ఈ కేసుకు సంబంధించిన నివేదికను సీబీఐ అందజేయనుంది. 20 నెలల క్రితం బెంగళూరులోని ఓ అపార్ట్ మెంట్ లో రవి అనుమానాస్పద రీతిలో చనిపోయారు. రవి మరణం జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో పాటు, విపక్షాలు, ప్రజల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సీబీఐ విచారణకు ఆదేశించారు. మరోవైపు, రవిది ఆత్మహత్య కాదని అతని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమకున్న అనుమానాలను సీబీఐ అధికారులతో చెప్పుకోవడానికి ఎన్నోసార్లు ప్రయత్నం చేశామని... కానీ, ఫలితం లేకుండా పోయిందని రవి తల్లి గౌరమ్మ వాపోయారు. ఇంకోవైపు, రవి మామ హనుమంతరాయప్ప మాట్లాడుతూ, నివేదికలోని వివరాలు బయటకు వెల్లడయ్యేంతవరకు తానేమీ మాట్లాడనని చెప్పారు. ఒకవేళ రవి ఆత్మహత్యకు తన కుటుంబ సభ్యులే కారణమని తేలితే ఎలాంటి శిక్షకైనా సిద్ధమేనని తెలిపారు.