: 'అధ్యక్షుడు ఎవరో చెప్పొద్దు' అని మెడలో బోర్డు తగిలించుకుని తిరుగుతున్న అమెరికన్!
"ఎవరు గెలిచారో నాకు తెలియదు. తెలుసుకోవాలని కూడా లేదు. దయచేసి నాకు ఎవరూ చెప్పొద్దు" అని రాసున్న బోర్డును మెడలో కట్టుకుని, ఎవరైనా చెప్పినా కూడా తనకు వినపడకుండా ఉండేందుకు చెవుల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని తిరుగుతున్నాడో అమెరికన్ వ్యక్తి. అధ్యక్షుడిగా ఎవరు గెలిచారన్న విషయం తనకు చెప్పొద్దని అంటున్నాడు. జార్జియా రాష్ట్రానికి చెందిన జో చాండ్లర్. ఎన్నికల ఫలితాలు విడుదల అయ్యే రోజున, వాటిని చూస్తూ, టెన్షన్ పడటం బదులు ఉదయాన్నే చూద్దామని భావించిన చాండ్లర్, ఆపై దాన్ని సాయంత్రానికి, తదుపరి మరుసటి రోజుకు వాయిదా వేసుకున్నాడు. ఇలా అధ్యక్షుడు ఎవరో తెలియక పోవడంతో నెలకొన్న సస్పెన్స్ అతనికి నచ్చడంతో, టీవీలు, పేపర్ చూడటం కూడా మానేశాడు. రెండు వారాల నుంచి ఇలా బోర్డు కట్టుకుని తిరుగుతున్నాడు. ఇక చాండ్లర్ వెర్రి పట్ల నవ్వుకుంటూనే, అతని స్నేహితులు, బంధువులు ఎన్నికల గురించిన విషయాలేవీ అతని వద్ద ప్రస్తావించడం లేదట.