: జన్ ధన్ డిపాజిట్లన్నీ బ్లాక్ మనీ కాదు... అందులో కష్టార్జితాలు కూడా వున్నాయి: ఆర్థికవేత్తలు
జన్ ధన్ ఖాతాల్లో రూ. 21 వేల కోట్ల డబ్బు జమ అయిందని, ఈ ఖాతాలన్నింటినీ పరిశీలించి, రూ. 2.5 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్ అయిన ఖాతాలను విచారిస్తామని కేంద్రం ప్రకటించడాన్ని ఆర్థిక వేత్తలు తప్పుపడుతున్నారు. జన్ ధన్ యోజన ఖాతాల్లో ఉన్న డబ్బంతా నల్లధనం కాదని వ్యాఖ్యానిస్తూ, ప్రజలను ఇబ్బందులు పెట్టాలని చూస్తే, మోదీ సర్కారుకు తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ నే పరిశీలిస్తే, మోదీ పెద్ద నోట్ల రద్దును ప్రకటించిన నవంబర్ 8 కన్నా ముందే 44,94,169 జన్ ధన్ ఖాతాల్లో రూ. 6,286.65 కోట్ల నగదు డిపాజిట్ గా ఉందని గుర్తు చేశారు. ఆపై వచ్చి చేరిన మొత్తం స్వల్పమేనని అన్నారు. ఎన్నో రాష్ట్రాల్లో మత్స్యకారులు, చిన్న చిన్న వ్యాపారస్తులు, ఐసీడీఎస్ వర్కర్లు తమ రోజువారీ లావాదేవీల కోసం బ్యాంకుల్లో ఎక్కువ నగదు వేస్తుంటారని, ఆపై విత్ డ్రాలు చేస్తుంటారని తెలిపారు. దేశంలో వేలకొద్దీ గ్రామ పంచాయతీల్లో ఏటీఎం సౌకర్యాలు లేవని, ఈ ప్రాంతాల్లోని వారంతా ఇళ్లలో డబ్బు జాగ్రత్తగా దాచుకునే వారని గుర్తు చేస్తూ, వారు తమ డబ్బును ఇప్పుడు ఖాతాల్లో దాచుకుని ఉండవచ్చని తెలిపారు. జన్ ధన్ ఖాతాలో కొంతమేరకు నల్లధనం అసలు రాదని, రాలేదని తాను వ్యాఖ్యానించబోనని చెప్పిన ఆర్థికవేత్త సౌగత్ మర్జిత్, దాన్ని సాకుగా చూపి ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని ఆర్థిక, ఐటీ శాఖలకు సలహా ఇచ్చారు. ఎంతో మంది రోడ్డు పక్క వ్యాపారులు, చిరు తిళ్లు, హోటల్ దుకాణాల వారు రోజువారీ నగదు లావాదేవీలే చేస్తుంటారని, దాన్ని 'ఎక్స్ ట్రా-లీగల్' అనవచ్చేగానీ, 'ఇల్లీగల్' అనలేమని అన్నారు. అదే విధంగా వ్యవసాయం, ఎంఎస్ఎంఈ రంగాల్లో సైతం ఇదే విధమైన పరిస్థితి నెలకొందని, వారి వద్ద లెక్కలో లేని డబ్బున్నా, దాన్ని నల్లధనంగా చూడలేమని, ఒకవేళ, దాన్ని బ్లాక్ మనీగా చూపి చర్యలకు దిగితే, వ్యవస్థ కుదేలైపోతుందని హెచ్చరించారు.