: పాత నోట్ల డిపాజిట్టుపై బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలు!
నవంబర్ 10 నుంచి 500, 1000 రూపాయల నోట్లు భారీ ఎత్తున జమ కావడంతో ఆయా బ్యాంకుల్లో నిల్వలు పెరిగిపోయాయి. దీంతో పెద్దఎత్తున పోగవుతున్న 500, 1000 నోట్లను ఏం చేయాలో అర్థంకాక బ్యాంకు అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకుల సమస్యకు ఆర్బీఐ తాత్కాలిక పరిష్కారం చూపించింది. రద్దు చేసిన 500, 1000 రూపాయల నోట్లను ఆయా బ్యాంకులు తమ పరిధిలోని ప్రాంతీయ రిజర్వ్ బ్యాంక్ శాఖలో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ తెలిపింది. ఈ నోట్లను ఆర్బీఐ అధికారులు యథాతథంగా అక్కడి అలమారాల్లో సీలువేసి భద్రపరుస్తారని, ఈ మొత్తం నగదు ఏ బ్యాంకు అయితే జమ చేసిందో అదే బ్యాంకు అధీనంలో ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఇలా చేయడం వల్ల బ్యాంకుల్లో పేరుకున్న నగదు తరగడంతో పాటు, ఆయా బ్యాంకు శాఖలు ఆర్బీఐ నుంచి క్రెడిట్ తీసుకునే వెసులుబాటు కలుగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది. దీంతో నకిలీలు, దెబ్బతిన్న నోట్లు, ఇతర నోట్లపై ఆర్బీఐకి స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.