: పంజాబ్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున సిద్ధూ ప్రచారం చేస్తారు: అమరీందర్ సింగ్
ప్రముఖ మాజీ క్రికెటర్, బీజేపీ మాజీ ఎంపీ నవజ్యోత్ సింగ్ సిద్ధూ రాజకీయ పాత్రపై నిర్ణయం తీసుకున్నారని పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ సింగ్ తెలిపారు. పంజాబ్ ప్రజలకు సేవ చేస్తానని రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సిద్ధూ తరువాత ఏ పార్టీ తరపున పోటీ చేస్తారంటూ పెద్ద చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో ఆప్ లో చేరుతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే ఒకే ఇంట్లో ఇద్దరికి పదవులు అన్నదానికి ఆ పార్టీ వ్యతిరేకమన్న నిబంధన సిద్ధూ అందులో చేరేందుకు అడ్డంకిగా మారింది. అనంతరం పంజాబ్ కు చెందిన ఇతర క్రీడాకారులతో కలిసి ఆవాజ్-ఈ-పంజాబ్ పార్టీని ఏర్పాటు చేసి, విభేదాల కారణంగా దానిని అటకెక్కించారు. ఈ నేపథ్యంలో బీజేపీకి రాజీనామా చేసిన సిద్ధూ భార్య నవ్ జ్యోత్ కాంగ్రెస్ లో చేరారు. ఈ నేపథ్యంలో అమరీందర్ సింగ్ మాట్లాడుతూ, సిద్ధూ భార్య తమతోనే ఉన్నారని అన్నారు. దీంతో సిద్ధూ పదవి కోరకుండానే కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని తెలిపారు. సిద్ధూ సతీమణి నవ్ జ్యోత్ కౌర్, ఆవాజ్-ఈ-పంజాబ్ నేత పర్గత్ సింగ్ ఈ నెల 28న కాంగ్రెస్లో చేరనున్నారని ఆయన ప్రకటించారు. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సిద్ధూకి కేబినెట్ పదవి లేదా లోక్ సభ స్థానం ఇవ్వనున్నారన్న వార్తలు ప్రచారంలో ఉన్నాయి.