: అమ్మాయి మీద చిరుత పంజా విసరగానే.. ఆయువకుడు సింహంలా దూకాడు!
ఢిల్లీ శివార్లలో ఓ యువకుడు పెద్ద సాహసం చేశాడు. నగర శివార్లలోని గుర్ గ్రామ్ సమీపంలోని మండవర్ గ్రామంలోకి నేటి ఉదయం 8:10 నిమిషాలకు ఒక చిరుతపులి ప్రవేశించింది. పొగమంచు కారణంగా అడవికి దగ్గర్లోని చెరకు తోటల్లోకి వచ్చి గ్రామంలో ప్రవేశించింది. ఇది సుమారు మూడు గంటల పాటు అక్కడే తిరిగింది. దానిని గమనించిన స్థానికులు దాని వద్దకు వెళ్లేందుకు సాహసించలేదు. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో దానిని తరుముకుంటూ ఒక ఖాళీ ఇంట్లోకి వెళ్లేలా చేశారు. అందులో ప్రవేశించిన చిరుత అక్కడ ఏర్పడిన కోలాహలంతో పారిపోయే ప్రయత్నంలో గోడలపై నుంచి ఆ ఇంటి మేడ ఎక్కేసింది. దానిని చూసేందుకు ఉత్సాహం చూపిన ఓ యువతి మెడపై పంజా విసిరింది. దీనిని చూసిన ఓ యువకుడు దానిపై సింహంలా లంఘించాడు. వెనుక నుంచి మెడను గట్టిగా పట్టుకున్నాడు. దీంతో మిగిలినవారు ధైర్యం చేసి దానిని కర్రలతో మోది చంపేశారు. ఈ ఘటనలో పలువురు గ్రామస్థులు గాయపడ్డారు. వారిని సోహ్నా ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఈ సందర్భంగా అధికారులపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమీపంలోని ఆరావళి పర్వతాలనుంచి చిరుతలు గ్రామంలో చొరబడుతున్నాయని, అటవీశాఖాధికారులు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు మండిపడ్డారు. చిరుతను పట్టుకునేందుకు అటవీశాఖాధికారులు ఒక వలతో వచ్చారని, కనీసం మత్తు ఇంజెక్షన్లు కూడా పట్టుకురాలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.