: సోషల్ మీడియాలో సచిన్ ను గుర్తు చేస్తున్న చిచ్చరపిడుగు!
సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోను టీమిండియా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ చూస్తే కనుక... తన బాల్యాన్ని గుర్తు చేసుకుంటాడు. ఎందుకంటే, పిల్లాడిగా ఉన్ననాటి నుంచే సచిన్ అత్యంత ప్రతిభావంతుడైన క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. దీంతో సచిన్ కేవలం 15 ఏళ్లకే ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. అదే రీతిలో ఢిల్లీ తరపున ఐదేళ్ల రుద్రప్రతాప్ అండర్-14 డిల్లీ జట్టుకు ఎంపికై సంచలనం సృష్టించాడు. రుద్రప్రతాప్ కు సంబంధించిన 2014 నాటి వీడియో ఇప్పుడు ట్విట్టర్, ఫేస్ బుక్ లలో చక్కర్లు కొడుతోంది. డెత్ ఓవర్లలో ప్రత్యర్థి జట్టుపై అతడి బ్యాటింగ్ శైలి, నిబ్బరం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. పిల్లాడి స్టాన్స్, టెంపర్ మెంట్, తనకంటే 10 ఏళ్లు పెద్దవాళ్లతో ఆడిన ఆట అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. బ్యాటంత సైజ్ కూడా లేని రుద్రప్రతాప్ బ్యాటింగ్ చేసే విధానం అందర్నీ ఆకట్టుకుంటోంది.