: 'డెడ్ సీ' చచ్చిపోతోంది... శాస్త్రవేత్తల ఆందోళన!


భౌగోళిక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. గడచిన 25 ఏళ్లలో సంభవించిన మార్పులు ప్రపంచాన్ని సమూలంగా మార్చేశాయి. పారిశ్రామిక విప్లవం రావడంతో ఒక్కసారిగా ప్రజల జీవన విధానం మారిపోయింది. గ్లోబలైజేషన్ లో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశ్రమలు వెలిశాయి. ఎన్నో దేశాలు అభివృద్ధి దిశగా అడుగులు వేసే క్రమంలో చేసిన ప్రయత్నాలతో గతంలో ఎప్పుడూ వినని గ్లోబల్ వార్మింగ్ వంటి పదాలను వింటున్నాం. ఈ క్రమంలో భూమి లోపలి పొరల్లో ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయో కానీ... ఇజ్రాయెల్, జోర్డాన్, వెస్ట్‌ బ్యాంక్‌ మధ్యనున్న డెడ్‌ సీ ఏడాదికి మూడున్నర అడుగుల చొప్పున కుచించుకుపోతోంది. దీంతో భూమికి అత్యంత దిగువన, అంటే సముద్రమట్టానికి దాదాపు 1400 అడుగుల దిగువన ఏదో జరుగుతోందని, ఇదిలాగే కొనసాగితే కొంతకాలానికి డెడ్‌ సీ పూర్తిగా కాలగర్భంలో కలసిపోతోందని 'ఎకోపీస్‌ మిడిల్‌ ఈస్ట్‌' గ్రూప్‌ కు చెందిన పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి డెడ్‌ సీ అనేది సముద్రం కాదు సరస్సు. దీనికి డెడ్ సీ అన్న పేరు రావడానికి కారణం, దీనిలో ఉండే నీరు సముద్రంలో ఉండే నీటికంటే 9.6 శాతం అధికంగా ఉప్పగా ఉంటుంది. దీంతో ఇందులో ఎలాంటి జీవి బతకదు. ఈ సరస్సులోని నీటిలో 34 శాతం ఉప్పు ఉండడం వల్ల ఇందులో దిగిన మనుషులు మునిగిపోరు... తేలిపోతారు. అయితే ఈ నీరు నోటిలోకి వెళ్తే... విషం నోట్లో వేసుకున్నట్టు ఉంటుంది. ఈ నీరు కంటికి తగిలినా, కనీసం ఆవిరి తగిలినా ఎలాంటి ప్రయత్నం లేకుండానే భరించలేని మంటతో పాటు, కనీళ్లు కూడా వచ్చేస్తాయి. అయితే, ఈ నీటికి ఎన్నో ఔషధగుణాలు ఉండడంతో ఇది ప్రపంచ యాత్రికులను విశేషంగా ఆకర్షిస్తోంది. ఇందులో జలకాలాడితే శరీరంలోని జబ్బులన్నీ నయమైపోతాయన్నది ఒక నమ్మకమైతే, జీసస్ ఈ ప్రాంతాల్లో తిరిగాడాడన్నది ఇంకో నమ్మకం. దీంతో ఇక్కడికి వచ్చేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతారు. కాస్మోటిక్స్‌, ఆయుర్వేద ఔషధాల్లో ఈ జలాలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎరువుల్లో ఉపయోగించే పొటాష్‌ కూడా ఈ జలాల నుంచి తయారుచేస్తున్నారు. ఈ సరస్సు చుట్టుపక్కల చెట్లు, జంతువులేవీ బతకవు కనుక దీనికి డెడ్‌ సీ అని పేరు వచ్చింది. పేరుకు తగ్గట్లుగా ఇప్పుడు అది చావుకు దగ్గరవుతోంది. ఇందుకు బాధ్యత ఇజ్రాయెల్, జోర్డాన్, పాలస్తీనా దేశాలది. ప్రధానంగా డెడ్ సీకి వచ్చే నీటిలో జోర్డాన్‌ నుంచి వచ్చేది సింహభాగం. దీనిలోకి ప్రవహించే జోర్డాన్‌ నదికి ఆనకట్ట కట్టి, దానికి పైప్ లైన్ వేసి ఆ దేశ ప్రజల మంచినీటి అవసరాలు తీర్చుకుంటున్నారు. దీంతో డెడ్ సీకి చేరే నీరు గణనీయంగా తగ్గిపోయింది. దీనికితోడు మధ్యప్రాచ్యంలో ఉండే ఎండ వేడిమి, పొడి వాతావరణం కూడా డెడ్ సీ నీరు ఆవిరై పోవడానికి కారణమవుతోంది. దీంతో డెడ్ సీ డెడ్లీ కష్టాలు అనుభవిస్తోంది. డెడ్ సీని పునరుద్ధరించేందుకు ఇజ్రాయెల్, జోర్డాన్‌ దేశాల మధ్య 1994 లో 90 కోట్ల డాలర్లతో ఒప్పందం కుదిరింది. అయితే ఈ ప్రాజెక్టు పనుల గురించి ప్రపంచ దేశాలకు తెలీదు. దీంతో దీనిని గురించి ప్రపంచం పట్టించుకోవాలని కోరుతూ.. వివిధ దేశాలకు చెందిన 30 మంది స్విమ్మర్లు ఈ ఏడాది మొదట్లో ఇందులో తొమ్మిది మైళ్లు ఈదారు. ఈ సందర్భంగా కళ్లకు గాగుల్స్ పెట్టుకున్నా యాసిడ్ పోసినట్టు కళ్లు మండిపోయాయని వారు తెలిపారు. కాగా, దీనిపై మోరిజ్‌ కుస్ట్‌ నర్‌ అనే పర్యావరణ ఫొటోగ్రాఫర్‌ 'ద డయ్యింగ్‌ డెడ్‌ సీ' పేరిట ఒక డాక్యుమెంటరీ రూపొందించే పనిలో ఉన్నారు.

  • Loading...

More Telugu News