: నరేష్ అగర్వాల్ మాటలకు విరగబడి నవ్విన మోదీ, జైట్లీ!
రాజ్యసభలో జరిగిన చర్చలో సమాజ్ వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ మాటలకు ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హాయిగా నవ్వుకున్నారు. నేటి ఉదయం చైర్మన్ హమీద్ అన్సారీ ఆధ్వర్యంలో జరిగిన పెద్ద నోట్లపై రద్దు చర్చకు ప్రధాని హాజరయ్యారు. ఈ సందర్భంగా నరేష్ అగర్వాల్ మాట్లాడుతూ, ప్రధాని ఈ నిర్ణయాన్ని ఏకపక్షంగా తీసుకున్నారని నిష్టూరమాడారు. కనీసం ఆర్థిక మంత్రికి కూడా తెలియనివ్వలేదని చెప్పారు. చివరకు వారికి చెప్పేసరికి ఫోన్లు కూడా వారి చేతుల్లో లేకుండా చేశారని ఆయన అన్నారు. ఒకవేళ అరుణ్ జైట్లీకి ముందే ఈ నిర్ణయం తెలిసి ఉంటే కనుక... తప్పకుండా తన చెవిలో ఊది ఉండేవారని చెప్పారు. ఎందుకంటే జైట్లీ, తాను మంచి మిత్రులమని అన్నారు. దీంతో ప్రధాని సహా అరుణ్ జైట్లీ కూడా నవ్వేశారు. అనంతరం ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ... పెద్ద నోట్ల నిర్ణయంతో తనను బతకనివ్వరని ప్రధాని ఆందోళన చెందుతున్నారని, ఉత్తరప్రదేశ్ లో అలా భయపడక్కర్లేదని, మోదీ తమ రాష్ట్రంలో సురక్షితంగా ఉంటారని ఆయన అన్నారు. దీంతో సభ మొత్తం మరోసారి నవ్వుల్లో మునిగిపోయింది.