: ఆ కుంభకోణాలే దేశంలో నల్లధనాన్ని పెంచాయి: అరుణ్ జైట్లీ
2004-14 సంవత్సరాల మధ్య జరిగిన కుంభకోణాలే దేశంలో నల్లధనాన్ని పెంచి పోషించాయని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ విమర్శించారు. 2జీ, బొగ్గు కుంభకోణాల కంటే నల్లధనం నివారణ చర్యలే మీకు కనిపిస్తున్నాయా? అని జైట్లీ మండిపడ్డారు. కుంభకోణాలు కాంగ్రెస్ కు తప్పుగా కనిపించడం లేదని, నల్లధనం, పెద్దనోట్ల రద్దుపై చర్చకు రాకుండా విపక్షాలు పారిపోతున్నాయని, మొదటి రోజు నుంచి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని చెబుతున్నామన్నారు. రాజ్యసభలో తొలిరోజు చర్చ ప్రారంభించి సాయంత్రానికి విధానం మార్చుకున్నారని, విపక్షాలకు ఈ విషయంపై చర్చ అవసరం లేనట్లుగా కనిపిస్తోందన్నారు. దేశాభివృద్ధి రేటు పెరుగుదలకు నల్లధనంపై చర్యలు ఉపయోగపడతాయని, పెద్దనోట్ల రద్దు వల్ల బ్యాంకుల్లో ఎన్ పీఏ (నిరర్థక ఆస్తులు)ల సంఖ్య గణనీయంగా తగ్గుతోందని జైట్లీ పేర్కొన్నారు.