: రాజ్యసభలో మళ్లీ గందరగోళం... సభ శుక్రవారానికి వాయిదా
ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంటుకు వస్తే తప్ప చర్చ జరిపేది లేదని రాజ్యసభకు విపక్షాలు స్పష్టం చేశాయి. వాయిదా అనంతరం 3 గంటలకు సభ ప్రారంభమైన అనంతరం కాంగ్రెస్ ఎంపీ ఆనంద్ శర్మ మాట్లాడుతూ, పెద్ద నోట్ల రద్దుపై చర్చ జరగాలని, ఆ చర్చలో ప్రధాని ప్రత్యక్షంగా పాల్గొనాలన్నది తమ డిమాండ్ అన్నారు. ఒక వేళ అలా జరగదని ప్రభుత్వం చెబితే సభలో చర్చలో పాల్గొనాలన్న ఆసక్తి తమకు లేదని స్పష్టం చేశారు. దీంతో కేంద్ర మంత్రులు మాట్లాడుతూ, చర్చ జరిగితే ప్రధాని వస్తారని అన్నారు. అంత వరకు చర్చ జరగాలని సూచించారు. అయితే, దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. దేశంలో ఎక్కడ పడితే అక్కడ మాట్లాడే ప్రధాని...తాను తీసుకున్న నిర్ణయాన్ని చట్టసభ సభ్యులకు వివరించడంలో ఉన్న ఇబ్బందులేంటని వారు నిలదీశారు. ప్రధాని పార్లమెంటు నుంచి ఎందుకు పారిపోతున్నారని వారు నిలదీశారు. దీనికి అధికార పక్షం అంగీకరించకపోవడంతో వెల్ లోకి విపక్ష ఎంపీలు దూసుకురావడంతో, రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ సభను రేపటికి వాయిదా వేశారు. దీంతో సభ ప్రారంభమైన కాసేపటికే వాయిదా పడింది.