: వాయిదా తరువాత ప్రారంభమైన రాజ్యసభలో కనిపించని ప్రధాని మోదీ... విపక్షాల ఆందోళన
వాయిదా తరువాత తిరిగి 2 గంటలకు ప్రారంభమైన రాజ్యసభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కనిపించలేదు. మోదీ గైర్హాజరుపై విపక్ష నేతలు మండిపడ్డారు. ఉదయం 12 గంటల అనంతరం రాజ్యసభలో పెద్దనోట్లపై చర్చ జరిగిన విషయం తెలిసిందే. సభలో విపక్ష నేతలు పెద్దనోట్ల రద్దుపై చేసిన ప్రసంగాలని మోదీ శ్రద్ధగా విన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు రాజ్యసభ వాయిదాపడే వరకు రాజ్యసభలోనే ఉన్నారు. విపక్షాల ప్రసంగం తరువాత వారు అడిగిన ప్రశ్నలకి పాలక పక్షం సమాధానం ఇవ్వాల్సి ఉంది. రాజ్యసభలో మోదీ సమాధానం చెప్పాల్సిందేనని నినాదాలు చేస్తూ, తీవ్ర స్థాయిలో గందరగోళం చేస్తోన్న ప్రతిపక్షాలు ఈ రోజు మోదీ నుంచి సమాధానం వస్తుందని అనుకున్నారు. అయితే, ప్రస్తుతం మళ్లీ మోదీ రాజ్యసభలో కనపడకపోవడంతో విపక్షనేతలు మరోసారి గందరగోళం సృష్టించారు. దీంతో సభను మధ్యాహ్నం మూడు గంటలవరకు వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్ కురియన్ పేర్కొన్నారు.