: విసిగివేసారిన ప్రజలు.. అధికారి ఇంట్లో మొసలిని వదలిన వైనం!
ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ చెప్పులు అరిగిపోయేలా తిరిగినా ఫలితం లేకపోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు అధికారులపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండడం ప్రతిరోజు కనిపిస్తూనే ఉంటుంది. వేలకు వేలు జీతాలు తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలు చేసే ఫిర్యాదుల పట్ల మాత్రం తీవ్ర నిర్లక్ష్య ధోరణి కనబరుస్తుంటారు. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఇటువంటి ప్రవర్తనే కనబరిచిన అధికారులకి తమ కష్టాలు రుచిచూపేలా ప్రజలు బుద్ధిచెప్పారు. అక్కడి శివపురి ప్రాంతంలోని బాలి కాలనీ పక్కనే ఉన్న నీటి కొలనులోంచి ఓ మొసలి కాలనీలోకి వచ్చి ప్రజలను భయాందోళనలకు గురిచేసింది. ఈ అంశంపై ప్రజలు స్థానిక అటవీ శాఖ అధికారులకు ఫోన్లు చేసి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకొని ఎన్ని గంటలు గడిచినా స్పందన రాలేదు. అధికారులు కనబరిచిన తీవ్ర నిర్లక్ష్యం ప్రజలకు ఆగ్రహం తెప్పించింది. వారంతా కలిసి ఎలాగోలా మొసలిని బంధించారు. దాన్ని నేరుగా తీసుకెళ్లి అటవీ శాఖ అధికారి ఇంట్లో వదిలేశారు. అధికారి ఇంట్లో మొసలి ఉండడంతో, దాన్ని పట్టుకోవడానికి సిబ్బంది క్షణాల్లో అక్కడికి వచ్చేశారు. మొసలిని తీసుకొని వెళ్లిపోయారు.