: పార్లమెంటు ఉభయసభలు ప్రారంభం.. సీన్ రిపీట్
పార్లమెంటు ఉభయసభలు ప్రారంభమయ్యాయి. పెద్దనోట్ల రద్దుపై రాజ్యసభలో విపక్షాల ఆందోళనను కొనసాగించాయి. చర్చ చేపట్టాల్సిందేనని నినాదాలు చేశాయి. జీరో అవర్ తరువాత పెద్దనోట్ల రద్దుపై చర్చ చేపడుదామని డిప్యూటీ ఛైర్మన్ కురియన్ అన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు మాత్రం తమ నినాదాలు కొనసాగించారు. దీంతో రాజ్యసభను 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు కురియన్ పేర్కొన్నారు. మరోవైపు లోక్‌సభ ప్రారంభమైన పదినిమిషాలకే వాయిదా పడింది. ఇటీవల కన్నుమూసిన సంగీత విధ్వాంసుడు బాలమురళీకృష్ణకు లోక్‌సభ సభ్యులు సంతాపం తెలిపారు. ఆయన మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటు అని స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ పెద్దనోట్ల రద్దుపై వివరణ ఇవ్వాల్సిందేనని విపక్ష నేతలు పట్టుబట్టారు. అయితే, కేంద్ర మంత్రి అరుణ్‌జైట్లీ పెద్దనోట్ల రద్దుపై వివరణ ఇస్తారని ప్రభుత్వ నేతలు చెప్పారు. మోదీ వివరణ ఇవ్వాల్సిందేనని విపక్షాలు నినాదాలు చేయడంతో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సభను వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ పేర్కొన్నారు. ఈ రోజు రాజ్యసభలో ప్రధాని మోదీ మాట్లాడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.