: పాపపు కూపంలో పడకుండా యువతిని కాపాడిన నోట్ల రద్దు
నోట్ల రద్దు తరువాత దేశంలోని అక్రమార్కులు దాచుకున్న నల్లధనం బయటకు వస్తే, అది దేశాభివృద్ధికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చెప్పలేం కానీ, ప్రస్తుతానికి మాత్రం ఓ యువతి వ్యభిచార మురికికూపంలోకి నెట్టివేయబడకుండా కాపాడింది. రూ. 20 లక్షలకు డీల్ కుదిరిన తరువాత కొత్త నోట్లు లేకపోవడంతో 21 ఏళ్ల యువతి హ్యూమన్ ట్రాఫికర్స్ బారిన పడకుండా తప్పించుకోగలిగింది. ఈ ఘటన రాజస్థాన్ లోని అల్వార్ జిల్లాలో జరిగింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, బాధితురాలిని ఆమె కుటుంబ సభ్యులే విక్రయానికి ఉంచారు. వ్యభిచార గృహాలకు అమ్మాయిలను సరఫరా చేసే ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని రూ. 20 లక్షలకు విక్రయించారు. అయితే, ఆ ఏజంట్ కొత్త కరెన్సీని ఇవ్వలేక పోయాడు. పాత కరెన్సీని తీసుకునేందుకు యువతి బంధువులు అంగీకరించలేదు. చెక్కు తీసుకునేందుకూ వారు ఒప్పుకోలేదు. దీంతో తాత్కాలికంగా డీల్ రద్దు కాగా, తనను మళ్లీ అమ్మేస్తారన్న భయంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో మొత్తం ఉదంతం వెలుగులోకి వచ్చింది. తన విక్రయంపై సోదరులతో గొడవ పడి, ఇక లాభం లేదనుకున్న ఆమె తమ సహాయం కోరిందని అల్వార్ అడిషనల్ ఎస్పీ పరాస్ జైన్ వెల్లడించారు. ఆపై ఓ మహిళా కానిస్టేబుల్ ను ఆమె వెంట పంపి మహిళా పీఎస్ లో ఫిర్యాదు చేయించామని తెలిపారు. సవాయ్ మధోపూర్ జిల్లాకు చెందిన ఈమెను సోదరులు, బావ ఓ స్నేహితుడి ఇంట్లో పార్టీ ఉందని చెప్పి తీసుకు వచ్చారని, అక్కడ ఈ విక్రయం జరిగిందని జైన్ తెలిపారు. ఈ ఘటనలో తన తండ్రి పాత్ర కూడా ఉందని బాధితురాలు ఫిర్యాదు చేసిందని, ఆరు నెలల క్రితం తన ఇంటికి వచ్చిన కజిన్, రూ. 20 లక్షల మొత్తానికి తనను అమ్మాలని ఇంట్లో వారికి చెప్పగా వారు అంగీకరించారని తెలిపింది. అల్వార్ బస్టాండులో తన సోదరుడు, ఏజంట్ మాటలు విని, వారి ఉద్దేశాన్ని గుర్తెరిగి, అక్కడి నుంచి పారిపోయి తమ వద్దకు వచ్చిందని, కేసును దర్యాఫ్తు చేస్తున్నామని జైన్ తెలిపారు. నోట్ల రద్దు తరువాత ఏదైనా లాభం జరిగిందా? అన్న ప్రశ్నకు సమాధానాలు వెతికితే, ఈ ఉదంతం తొలి స్థానంలో నిలుస్తుందనడంలో సందేహం లేదు!