: దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న వేళ కనిపించని ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్!
ప్రపంచంలోనే అతిపెద్ద నగదు సంక్షోభం భారత్ ను చుట్టుముట్టి వున్న వేళ, కేంద్ర బ్యాంకు అధికారిగా అనుక్షణం పరిస్థితిని సమీక్షిస్తూ, ప్రజలకు ఊరట కలిగించాల్సిన ఉర్జిత్ పటేల్ కనిపించకపోవడాన్ని పలువురు విమర్శిస్తున్నారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా ఉన్న ఉర్జిత్, ప్రజల్లోకి రాకపోవడంపై ఇప్పుడు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ నెల 8వ తేదీన మోదీ నోట్ల రద్దు అంశాన్ని ప్రకటించి, చలామణిలోని 86 శాతం కరెన్సీ రద్దయిందని ప్రకటించిన తరువాత ఉర్జిత్ పటేల్, ఒకే ఒక్కసారి మీడియా ముందుకు వచ్చారు. నగదు కొరత ఏర్పడి, దేశంలో గొడవలు జరగవచ్చని సుప్రీంకోర్టు హెచ్చరించినా కూడా ఉర్జిత్ తన అభిప్రాయాన్ని చెప్పలేదు. పటేల్ రాజీనామా చేయాలని బ్యాంకర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసినప్పటికీ, ఆయన స్పందించలేదు. అత్యంత కీలకమైన నగదు రద్దు విషయంలో ఎంతో ముందస్తుతో ప్రణాళికలు రూపొందించాల్సిన ఉర్జిత్, ఈ విషయంలో విఫలమయ్యారని న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ సలహాదారు, కార్నెల్ యూనివర్శిటీలో పరపతి చట్టాలను బోధించే రాబర్ట్ హాకెట్ అభిప్రాయపడ్డారు. ప్రజలకు కొంత సమయం ఇవ్వాల్సి వుందని ఆయన అన్నారు. రద్దుకు ముందే చాలినన్ని కొత్త నోట్లను ఉంచుకోవాల్సి వుందని తెలిపారు. తొలుత నరేంద్ర మోదీ ప్రభావం, హవా ముందు ఉర్జిత్ కనిపించడం లేదని భావించినప్పటికీ, తదుపరి ఆయన ప్రమేయం ఏమీ లేదని, అసలాయన విషయాన్ని, దాని తీవ్రతను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. రూపాయి విలువ రికార్డు స్థాయికి పతనమైన వేళ కూడా ఆయన దిద్దుబాటు చర్యలను ప్రారంభించలేదని ఎంతో మంది విమర్శిస్తున్నారు.