: కాంగ్రెస్ లో చేరుతున్న సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్.. ఆ తర్వాత సిద్ధూ కూడా?
బీజేపీకి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ భార్య నవజ్యోత్ కౌర్, తన భర్త వ్యవస్థాపకుడిగా ఉన్న ఆవాజ్-ఏ-హింద్ ను కాదని కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఆమె ఈ నెల 28వ తేదీన కాంగ్రెస్ లో చేరనున్నట్టు తెలుస్తోంది. అక్టోబర్ లో బీజేపీని వీడిన నవజ్యోత్ కౌర్ తో పాటు ఆవాజ్-ఏ-పంజాబ్ నేత ప్రతాప్ సింగ్ సైతం కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం. వీరి రాకను పంజాబ్ కాంగ్రెస్ చీఫ్ అమరీందర్ స్వాగతించారు. భావ సారూప్యత ఉన్న నవజ్యోత్ వంటి వారిని తమ పార్టీ అక్కున చేర్చుకుంటుందని, వారి రాకతో, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మరింత బలపడిందని అన్నారు. కాగా, సెప్టెంబర్ లో కొత్త రాజకీయ పార్టీని పెట్టిన సిద్ధూ, ఆపై ఎన్నికలే తమ లక్ష్యమని ఓసారి, ఎన్నికల్లో తాము పోటీ చేయబోమని మరోసారి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇక, నవజ్యోత్ తరువాత, సిద్ధూ కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సిద్ధూ పార్టీ మారడంపై మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.