: భారత్ భారీ దాడి తరువాత... సరిహద్దుల్లో రగులుతున్న పాక్!
వాస్తవాధీన రేఖ వెంబడి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. కాశ్మీర్ లో భారత జవాను తలనరికిన పాక్ సైనికుల ఉదంతం తరువాత ఇరు దేశాల మధ్యా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పాక్ సైన్యం ఇద్దరు జవాన్లను పొట్టనబెట్టుకుంటే, ప్రతిగా భారత్ జరిపిన దాడుల్లో 9 మంది వరకూ పాక్ సైనికులు మరణించినట్టు వార్తలు వస్తున్నాయి. భారత్ దాడి పట్ల రగిలిపోతున్న పాకిస్థాన్, సరిహద్దుల్లో భారీగా సైన్యాన్ని, మందుగుండు సామాగ్రిని మోహరిస్తోంది. మెషీన్ గన్స్, 120 ఎంఎం హెవీ మోర్టార్లను సరిహద్దుల్లోని బంకర్లు, పోస్టుల వద్దకు పాక్ చేరుస్తోంది. దీంతో జమ్మూకాశ్మీర్ సరిహద్దుల్లో మరో పోరు సాగవచ్చని అంచనా. ఇప్పటికే ఇరువైపులా తుపాకి తూటాల చప్పుళ్లు వినిపిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, భారత్ జరిపిన కాల్పుల్లో పాక్ భూభాగంలో బస్సులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులకు గాయాలైనట్టు తెలుస్తోంది. భారత పోస్టులను లక్ష్యంగా చేసుకుని కాల్పులు వచ్చిన ప్రాంతాలవైపు మాత్రమే తాము దాడులు చేశామని భారత సైనికాధికారి ఒకరు తెలిపారు.