: 16వ రోజుకు చేరుకున్న నోట్ల రద్దు.. అయినా కడతేరని కష్టాలు
పెద్దనోట్లు రద్దు చేసి నేటికి 16 రోజులు అయింది. అయినా బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలు పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉన్నాయి. చిల్లర కోసం ప్రజలు కష్టాలు పడుతూనే ఉన్నారు. నోట్ల మార్పిడి పూర్తిస్థాయిలో కాకపోవడంతోపాటు చాలా వరకు ఏటీఎంలు అలంకారప్రాయంగా మిగిలిపోవడంతో ప్రజలకు నానా ఇబ్బందులు తప్పడం లేదు. ఇక హైదరాబాద్‌లో అయితే దాదాపు 80 శాతం ఏటీఎంలు పనిచేయడం లేదు. నోట్ల రద్దుతో వ్యవసాయ మార్కెట్లు మూతపడ్డాయి. పంట కోతలపై సైతం రద్దు ప్రభావం కనిపిస్తోంది. కొందరు పెళ్లిళ్లను సైతం వాయిదా వేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రజల కష్టాలు కొనసాగుతున్నాయి. అత్యవసర వైద్య సేవలకు సైతం ఆటంకం కలుగుతోంది. ఈ నెల 8న పెద్ద నోట్లు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ రెండు మూడు రోజులు ప్రజలకు కష్టాలు తప్పవని, సహకరించాలని కోరారు. అయితే 16 రోజులు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు కనిపించకపోవడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిర్ణయం అమలులో లోపాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా త్వరితగతిన చర్యలు తీసుకుని కష్టాలు తీర్చాలని వేడుకుంటున్నారు.