: ఆస్ట్రేలియాకు రావాలంటూ కేటీఆర్‌కు ఆహ్వానం.. హర్షం వ్యక్తం చేసిన మంత్రి
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుకు ఆస్ట్రేలియా నుంచి ఆహ్వానం అందింది. వచ్చేనెల 5న మెల్‌బోర్న్‌లో జరిగే ఇండియా లీడర్‌షిప్ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఆ దేశ విదేశాంగ మంత్రి జూలీ బిషప్ ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ సమావేశానికి భారత్, ఆస్ట్రేలియాలకు చెందిన 50 మంది ప్రముఖ వ్యాపార వేత్తలు, ప్రభుత్వాధినేతలు, మేధావులను ఆహ్వానించారు. వారిలో కేటీఆర్ ఒకరు కావడం గమనార్హం. ప్రభుత్వాల పనితీరు, ఆర్థిక అంశాలు, వ్యాపార అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ విధానాలు, వ్యాపార అవకాశాలపై ప్రసంగించాల్సిందిగా జూలీ బిషప్ మంత్రిని కోరారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియాలోని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని జూలీ తెలిపారు. అలాగే సమావేశాల సందర్భంగా ఆస్ట్రేలియా ప్రధానితో సమావేశం ఏర్పాటు చేస్తామంటూ ఆస్ట్రేలియా హైకమిషన్ నుంచి కేటీఆర్‌కు ఈమెయిల్ అయింది. ఆస్ట్రేలియా ఆహ్వానంపై కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.