: బ్యాంకు మేనేజర్ల మార్పిడి మాయలు.. లాడ్జీలు, ఇళ్లలో బేరసారాలు
పెద్దనోట్ల రద్దు కొందరికి అందివచ్చిన అవకాశంగా మారింది. కమీషన్లకు కక్కుర్తి పడుతున్న కొందరు బ్యాంకు మేనేజర్లు దొడ్డిదారిన బడాబాబుల డబ్బులు మార్చేస్తున్నారు. నగదు మార్పిడి కోసం క్యూలలో నిల్చున్నవారికి మొండిచేయి చూపిస్తున్నారు. గంటల తరబడి లైన్లలో నిల్చుంటే తూతూమంత్రంగా ఓ పదిమందికి డబ్బులు మార్చి తర్వాత క్యాష్ లేదంటూ బోర్డులు పెట్టేస్తున్నారు. ఓ ప్రైవేటు బ్యాంకు ఖాతాదారు రాధిక అనే మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు మీడియాకెక్కడంతో అసలు విషయం బయటకొచ్చింది. ఇంతకీ ఏమైందంటే.. హైదరాబాద్‌లోని నిజాంపేటలో ఉన్న ఓ ప్రైవేటు బ్యాంకులో రాధిక ఖాతాదారు. డబ్బుల విత్‌డ్రా కోసం ఆమె బ్యాంకు తెరవకముందే వెళ్లి క్యూలో నిల్చున్నారు. బ్యాంకు తెరిచిన గంటలోపే 'నో క్యాష్' బోర్డు పెట్టారు. దీంతో మరుసటి రోజు మళ్లీ వెళ్లారు. అప్పుడూ అదే పరిస్థితి. దీంతో సహనం నశించిన ఆమె బ్యాంకు తెరిచిన గంటకే డబ్బులు ఎలా అయిపోతాయంటూ బ్యాంకు మేనేజర్ వద్దకు వెళ్లి నిలదీసింది. ఇదేదో తన తలకు చుట్టుకునే ప్రమాదం ఉందని గ్రహించిన ఆయన ఆమెకు డబ్బులు ఇచ్చి పంపించాల్సిందిగా సిబ్బందిని ఆదేశించారు. వారు ఆమెకు కొత్త నోట్లు ఇచ్చి పంపించారు. దీంతో బ్యాంకు అధికారులు డ్రామా ఆడుతున్నట్టు అర్థం చేసుకుంది. దీనివెనక పెద్ద తతంగమే నడుస్తున్నట్టు గుర్తించింది. వెంటనే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మీడియాకు విషయం చేరవేసింది. దీంతో సంచలన విషయాలు బయటపడ్డాయి. పాతనోట్ల డినామినేషన్లపై అధికారులకు లెక్కలు చెప్పాల్సిన అవసరం లేకపోవడాన్ని బ్యాంకు అధికారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. పాతనోట్లు మార్చిపెడతామంటూ బడా పారిశ్రామికవేత్తలు, నల్లకుబేరులు, కాంట్రాక్టర్లు, ప్రముఖ రాజకీయ నాయకులతో బేరాలు కుదుర్చుకుంటున్నారు. రూ.కోటికి రూ.25 లక్షలు కమిషన్‌గా తీసుకుంటూ దొడ్డిదారిన నోట్లు మార్చి ఇస్తున్నారు. ఎల్బీనగర్, అమీర్‌పేట, కూకట్పల్లి, ఖైరతాబాద్, మియాపూర్ తదితర ప్రాంతాల్లోని సెకెండ్‌క్లాస్ లాడ్జీల్లోనూ, ఇళ్లలోనూ ఈ బాగోతం జోరుగా సాగుతోంది.. చిన్నిచిన్ని లోపాలను తమకు అనువుగా మార్చుకుంటున్న బ్యాంకు అధికారులు భారీ మొత్తంలో కొత్త కరెన్సీని మార్చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. నిజానికి రోజువారీ లావాదేవీలపై సూక్ష్మ స్థాయి వివరాలను బ్యాంకు అధికారులు నమోదు చేయరు. అంటే ఆ రోజు కొత్త కరెన్సీని ఎంతమందికి ఇచ్చారు? వివరాలు, వారు ఇచ్చిన రూ.500, రూ.1000 నోట్ల వివరాలను ఎక్కడా నమోదు చేయరు. ఆ రోజుకు జరిగిన మొత్తం లావాదేవీలను మాత్రమే క్లోజింగ్ టైంకు ఉన్న నగదు నిల్వల గురించిన సమాచారాన్ని మాత్రమే పై అధికారులకు పంపిస్తారు. సరిగ్గా దీనినే తమ జేబులు నింపుకునేందుకు వాడుకుంటున్నారు. హెడ్ క్యాషియర్, జాయింట్ కస్టోడియన్ అధికారి చేతులు కలిపితే నికర పద్దుల్లో తేడా లేకుండా ఎంత పెద్దమొత్తాన్ని అయినా మాయ చేయవచ్చని బ్యాంకింగ్ నిపుణులు చెబుతున్నారు. బ్యాంకు మేనేజర్ల కమీషన్ల దందాపై రిజర్వ్ బ్యాంకుకు ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొందరు సహకార బ్యాంకుల మేనేజర్లపైనా ఫిర్యాదులు అందాయి. ఫిర్యాదులు వచ్చిన బ్యాంకుల రికార్డులును ఆర్బీఐ అధికారులు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అవకతవకలు గుర్తించిన అధికారులు కొన్ని బ్యాంకులకు నోటీసులు కూడా పంపినట్టు తెలుస్తోంది. కాగా తెలుగు రాష్ట్రాల్లో నల్లధనాన్ని పెద్ద ఎత్తున మారుస్తున్న నగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉన్నట్టు నిఘావర్గాలు కేంద్రానికి చెప్పినట్టు సమాచారం.