: 360 వయగ్రా ట్యాబ్ లెట్లు కొనుగోలు చేసిన కొరియా అధ్యక్ష భవనం!
దక్షిణ కొరియా అధ్యక్షురాలు పార్క్ గ్వెన్ హ్వే కార్యాలయం వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే అవినీతి ఆరోపణలతో పదవీ గండంతో ఇబ్బంది పడుతున్న పార్క్ గ్వెన్ హ్వే వయాగ్రా ట్యాబ్లెట్లు కొనుగోలు చేశారంటూ ప్రతిపక్ష ఎంపీ పేర్కొనడం ఇబ్బందిగా మారింది. ఈ నేపథ్యంలో పార్క్ గ్వెన్ హ్వే కార్యాలయం ప్రతిపక్ష ఎంపీ వ్యాఖ్యలు నిజమేనని పేర్కొంటూ వయాగ్రా ట్యాబ్లెట్లు కొనుగోలు చేయడానికి దారితీసిన కారణాలను వెల్లడించింది. దక్షిణ కొరియా అధ్యక్ష భవనం తెలిపిన వివరాల ప్రకారం.... 360 వయాగ్రా ట్యాబ్లెట్లను కొనుగోలు చేశామని ప్రకటించింది. రానున్న మేలో అధ్యక్షురాలు ఇథియోపియా, ఉగాండా, కెన్యా పర్యటనలకు వెళ్లనున్నారని, ఆ దేశాలు సముద్ర మట్టం కంటే ఒకటి, రెండు కిలోమీటర్ల ఎత్తులో ఉన్నందున అధ్యక్షురాలి సహాయక సిబ్బందికి... ఎత్తుకు సంబంధించిన రుగ్మత (ఆల్టిట్యూడ్ సిక్ నెస్) తలెత్తితే దానిని నివారించటం కోసం ఈ ట్యాబ్లెట్లను కొనుగోలు చేసినట్లు ప్రకటించింది. వీటిలో ఇంత వరకు ఒక్క ట్యాబ్లెట్ కూడా వాడలేదని అధ్యక్ష భవనం బ్లూ హౌస్ ప్రకటించింది. కాగా, వయాగ్రా టాబ్లెట్లు ఆల్టిట్యూడ్ సిక్ నెస్ ను నివారిస్తాయని నమ్ముతుండటం వల్ల పర్వతారోహకుల కోసం దక్షిణ కొరియా వైద్యులు వీటిని సిఫారసు చేస్తుంటారు.