: రూ.12.4 లక్షల విలువ చేసే కొత్త నోట్లను చేజిక్కించుకున్నారు.. కారులో తరలిస్తూ పట్టుబడ్డారు!
బ్యాంకుల ముందు లేదా ఏటీఎంల ముందు బారులు తీరిన క్యూలో నిలబడితేగానీ నగదు దొరకని పరిస్థితి దేశమంతా ఉంది. అయితే, అహ్మదాబాద్‌లో మాత్రం ఓ కారులో పెద్దఎత్తున నోట్ల కట్టలు కనిపించాయి. తనిఖీల్లో భాగంగా ఓ మారుతీ స్విఫ్ట్ కారుని చెక్ చేసిన పోలీసులు అందులో రూ.12.4 లక్షల విలువ చేసే కొత్త నోట్లు ఉండడం చూసి ఆశ్చర్యపోయారు. నగదుని మార్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వం అనేక నిబంధనలు పెట్టినప్పటికీ ఏకంగా ఇంత మొత్తంలో ఈ కొత్త నోట్లు కనిపించడం కలకలం రేపుతోంది. ఆ కారులో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రయాణిస్తున్నారు. కారుని ఆపి తనిఖీ చేస్తే అందులో కొత్త రూ.500, రూ.2000 నోట్ల కట్టలు కనపడ్డాయని పోలీసులు తెలిపారు. వివాహఖర్చుల కోసం కూడా బ్యాంకుల నుంచి 2.5 లక్షల నగదుని మాత్రమే విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంది. అయితే, పట్టుబడిన వ్యక్తులు తమ వివాహ ఖర్చుల కోసమే పలు బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు డ్రా చేసి తీసుకువస్తున్నామని చెప్పారు. పోలీసులు పెళ్లి శుభలేఖ, అదుకు తగిన ఆధారాలు చూపాలని అడగగా వారు తెల్లమొహం వేశారు. డబ్బును స్వాధీనం చేసుకున్న పోలీసులు ఇన్‌కం ట్యాక్స్ శాఖకు తరలించారు.