: పెళ్లి వేడుక జరుపుకుంటున్నారా?.. చెక్ చేయడానికి అధికారులు వస్తారు!
మీ ఇంట్లో పెళ్లి వేడుక జరుపుకుంటున్నారా?.. అందుకోసం ఆర్‌బీఐ సూచించిన నిబంధనల ప్రకారం బ్యాంకులో డబ్బు తీసుకున్నారా? అయితే, మీ పెళ్లి వేడుకకు అధికారులు కూడా వస్తారు. మీ ఇంట్లో నిజంగా పెళ్లి జరుగుతోందా? లేదా? అనే విషయాన్ని స్వయంగా చూస్తారు. ఎందుకంటే పెద్ద నోట్ల రద్దు తర్వాత నల్లకుబేరులు తమ వద్ద ఉన్న పాత నోట్లను మార్చుకోవడానికి అనేక ప్రయత్నాలు జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నల్లధనాన్ని మార్చుకోవడానికి పెళ్లి పేరుతో డ్రామాలాడి బ్యాంకు నుంచి రూ.2.5 లక్షలు విత్ డ్రా చేసుకొనే ప్రయత్నాలు చేయాలని యోచిస్తున్నారు. 2.5 లక్షల రూపాయలకు పైగా చేసే డిపాజిట్లపైనే కాకుండా బ్యాంకుల నుంచి రూ.2.5 లక్షలు విత్‌డ్రా చేసుకునే ఖాతాదారులపై కూడా ఆర్థికశాఖ అధికారులు నిఘా ఉంచారు. దీంతో ఈ నెల 8 తర్వాత జరిగిన పెళ్లిళ్లపై తాము సమాచారం సేకరిస్తున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ ఈ రోజు ప్రకటించింది. పెద్దనోట్ల రద్దు తరువాత జన్‌ధన్ యోజన ఖాతాల్లో నిన్నటి వరకు రూ.21 వేల కోట్లు జమ అయ్యాయని కేంద్ర ఆర్థికశాఖ అధికారులు పేర్కొన్నారు. వాటిల్లో అతి ఎక్కువగా డిపాజిట్లు జరిగిన రాష్ట్రాల్లో పశ్చిమ బెంగాల్ తొలిస్థానంలో ఉంటే, ఆ తరువాతి స్థానంలో కర్ణాటక ఉందని తెలిపారు. ఖాతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నామని నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పెళ్లి వేడుకల పేరుతో విత్ డ్రా, డిపాజిట్ అవుతున్న ఖాతాలపై తాము దృష్టి సారించామని చెప్పారు. ఇతరుల డబ్బుని తమ ఖాతాల్లో జమ చేసుకునే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.