: చంద్రబాబు, జగన్ లకు లేని రూల్స్ నాకు మాత్రమే ఎందుకు పెట్టారు?: ముద్రగడ
కాపు జాతిని తెలుగుదేశం ప్రభుత్వం చిన్న చూపు చూస్తోందని కాపు రిజన్వేషన్ల ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం విమర్శించారు. కాపుల హక్కులకోసం వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఆయన అన్నారు. రాజస్థాన్ లో గుజ్జర్లు, గుజరాత్ లో పటేళ్లు ప్రభుత్వాలు అనుమతి ఇస్తేనే ఉద్యమించారా? అని ఆయన ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, వైసీపీ అధినేత జగన్, ఆయన సోదరి షర్మిలలు ప్రభుత్వ అనుమతులతోనే పాదయాత్రలు చేశారా? అని అన్నారు. కాపు రిజర్వేషన్ల కోసం తాను చేపట్టిన సత్యాగ్రహ పాదయాత్రను ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. గతంలో చంద్రబాబు, జగన్ లకు లేని రూల్స్ తనకు మాత్రమే ఇప్పుడు ఎందుకు పెడుతున్నారని అన్నారు. కాపు కార్పొరేషన్ కు ఇవ్వాల్సిన రూ. 1000 కోట్లను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.