: రైల్వే సిబ్బంది దాడికి వినికిడి శక్తి కోల్పోయిన యువతి... ఆసుపత్రిలో చేరిన రిటైర్డ్ ఎస్సై!
రైల్వే సిబ్బంది దురుసుతనం ఇద్దర్ని ఆసుపత్రి పాలు చేసింది. వివరాల్లోకి వెళ్తే... చెన్నైలోని క్వీన్ మేరీ కళాశాలలో చదువుతున్న కవితను కలిసేందుకు ముగ్గురు స్నేహితురాళ్లు ఆమె ఇంటికి వచ్చారు. వారిని పంపించే క్రమంలో కవిత విల్లివాక్కం రైల్వే స్టేషన్ కు వెళ్లింది. ఈ క్రమంలో ముగ్గురు స్నేహితురాళ్లు ఫోటోలు తీసుకుంటూ ఆనందంగా నవ్వుకుంటున్నారు. ఈ సమయంలో అటుగా వెళ్తున్న చెకింగ్ ఇన్ స్పెక్టర్ వనిత తనను కామెంట్ చేసి, వారు నవ్వుతున్నారని అపార్థం చేసుకుంది. అంతే, వారిని నోటికొచ్చిన బూతులు తిడుతూ, కవితను జుట్టుపట్టుకుని పక్కనే ఉన్న రూంలోకి ఈడ్చుకెళ్లింది. అక్కడే ఉన్న ఇద్దరు సహ ఉద్యోగినులను పిలిచి ఆమె తనను తిట్టిందని చెప్పడంతో ముగ్గురూ కలిసి ఆమెపై దాడికి దిగారు. దీంతో కవిత ఏడుపువిన్న రిటైర్డ్ సబ్ ఇన్ స్పెక్టర్ రామలింగం అక్కడికి వెళ్లి ఏం జరిగిందని ఆరాతీశారు. అలా అడిగినందుకు ఆయనపై కూడా దాడి చేసి కొట్టారు. అప్పటికే కవిత స్పృహతప్పి పడిపోయింది. దీంతో ఈ విషయం ఎవరికైనా చెబితే ఇంతకుముందు స్టేషన్ లో హత్యకు గురైన స్వాతి గతే మీకు పడుతుందని రైల్వే సిబ్బంది కవిత స్నేహితులను బెదిరించారు. దీంతో కవిత స్నేహితులు ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారొచ్చి ఆసుపత్రిలో చేర్చారు. వారి దాడికి కవిత వినికిడి శక్తి కోల్పోయిందని వైద్యులు తెలిపారు. రామలింగం సైతం మరో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమార్తెపై దాడి చేసిన సిబ్బందిపై కవిత తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.