: వివాహేతర సంబంధం మోజులో.. కన్న కొడుకునే చావబాది చంపిన తల్లి!
తండ్రి లేని తన కొడుకుని కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన ఓ తల్లి తన కుమారుడి పట్ల దారుణంగా ప్రవర్తించింది. ఓ వ్యక్తితో పెట్టుకున్న వివాహేతర సంబంధానికి తన కొడుకు అడ్డు వస్తున్న కారణంగా ఆ చిన్నారిని చావబాదింది. దీంతో అభం శుభం తెలియని మూడేళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన నాందేడ్లో చోటుచేసుకుంది. ఆ ప్రాంతానికి చెందిన భారతీ బాబురావ్ షిండే(35)కు ఇద్దరు పిల్లలున్నారు. రెండేళ్ల క్రితం తన భర్త మరణించడంతో తన చిన్న కుమారుడిని తీసుకొని ముంబైకి వచ్చింది. అక్కడ ఆమె కుమార్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకొని వివాహేతర సంబంధం పెట్టుకుంది. కుమార్‌తో భారతీకి ఆ చిన్నారి విషయమై వాగ్వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలోనే తమ బంధానికి అడ్డొస్తున్నాడని తన మూడేళ్ల కుమారుడిని చావకొట్టింది. అనంతరం తీవ్రగాయాలపాలయిన ఆ బాలుడిని ఆసుపత్రికి తీసుకొచ్చింది. అయితే, ఆ చిన్నారి అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు చెప్పారు. మరోవైపు కుమార్ పరారీలో ఉన్నాడు. ఆ బాలుడి తల్లిని అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.