: అబుదాబిలో కేరళ ఎలక్ట్రీషియన్ కష్టాలు!


బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లిన భారతీయులు అక్కడ పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ముఖ్యంగా, అక్కడి ఫ్యాక్టరీల్లో, కంపెనీల్లో పనిచేసేందుకు వెళ్లిన కార్మికులు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) రాజధాని అబుదాబిలో భారతీయ ఎలక్ట్రీషియన్ పడుతున్న కష్టాలు వెలుగులోకి వచ్చాయి. అబుదాబిలోని షార్జాకి చెందిన ఒక నిర్మాణ సంస్థలో ఎలక్ట్రీషియన్ గా పనిచేసేందుకు కేరళకు చెందిన సజీవ్ రాజన్ వెళ్లాడు. రెండేళ్ల పాటు పనిచేసేలా ఒప్పందం కుదుర్చుకున్నాడు. 2016 మార్చి 11తో ఆ ఒప్పందం ముగిసింది. అయితే, జీతం డబ్బులు సరిపోకపోవడంతో తిరిగి కేరళకు వచ్చేయాలని నిర్ణయించుకున్నాడు. రెండేళ్ల గడువు ముగియగానే అతనికి ఇవ్వాల్సిన జీతం డబ్బులు సదరు సంస్థ ఇచ్చివేసింది. కానీ, అతని పాస్ పోర్ట్ మాత్రం ఇవ్వలేదు. దీంతో, అతనికి సమస్యలు మొదలయ్యాయి. ఎలక్ట్రీషియన్ గా పనిచేసినంత కాలం సంస్థ ఏర్పాటు చేసిన ఇంట్లోనే నివసించేవాడు. ప్రస్తుతం, ఒక భవనం టెర్రస్ పైన నివసిస్తున్న సజీవ్ రాజన్ కు ఒక రెస్టారెంట్ యజమాని దయాగుణం కారణంగా కొంచెం ఆహారం దొరుకుతోంది. మరో వ్యక్తి కొద్దోగొప్పో ఆర్థిక సాయం చేస్తున్నాడు. ఇలా ఎనిమిది నెలలుగా ఇబ్బందులు పడుతున్న సజీవ్ రాజన్, స్థానిక మీడియాను ఆశ్రయించాడు. తన పాస్ పోర్టు విషయమై కోర్టు చుట్టూ, భారత రాయబార కార్యాలయం చుట్టూ పలుసార్లు తిరిగినా ప్రయోజనం లేదని వాపోయాడు. మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న అక్కడి భారతీయులు, సజీవ్ రాజన్ కి సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. దీంతో, సంతోషపడుతున్న సజీవ్ రాజన్ త్వరలో తన కుటుంబాన్ని కలుసుకుంటానని భావిస్తున్నాడు. కాగా, రాజన్ పాస్ పోర్టు విషయమై సదరు సంస్థ యజమాని మాట్లాడుతూ, కార్మిక న్యాయస్థానం తీర్పు కోసం చూస్తున్నామని, అతనికి అవసరమైన సాయం అందించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు.

  • Loading...

More Telugu News