: ఇకపై బీమా ఉంటేనే రైలెక్కనిస్తారు... తప్పనిసరి కానున్న ప్రీమియం!
ఇండియాలో రైలు ప్రయాణ బీమా తప్పనిసరి కానుంది. ఈ మేరకు అతి త్వరలో కేంద్రం చట్ట సవరణ చేయనున్నట్టు సమాచారం. ఆదివారం నాడు యూపీలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో 148 మంది మరణించడం, ఆపై ఇండియాలోని బోగీలన్నింటినీ, ఆధునికీకరించాలంటే కనీసం 30 సంవత్సరాలు పడుతుందన్న అంచనాల నేపథ్యంలో, రైలెక్కే ప్రతి ప్రయాణికుడికీ బీమా సౌకర్యం ఉండాల్సిందేనని కేంద్రం చట్టం తేనుంది. ఈ మేరకు తయారైన ప్రతిపాదనలను రైల్వే శాఖ క్యాబినెట్ కు పంపనుంది. ప్రమాదం జరిగిన ఇండోర్ - పాట్నా ఎక్స్ ప్రెస్ లోని ప్రయాణికుల్లో 695 మంది ఆన్ లైన్ ద్వారా టికెట్లను బుక్ చేసుకోగా, అందులో 128 మంది మాత్రమే ట్రావెల్ ఇన్స్యూరెన్స్ తీసుకున్నారు. ఐఆర్సీటీసీ వెబ్ సైట్ లో ప్రయాణ బీమా సదుపాయం ఆప్షనల్ విభాగంలో ఉండటంతో, వద్దనుకున్న వారు తీసుకోకుండానే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఇకపై అలా కాకుండా బీమా తప్పనిసరి చేయాలన్నది కేంద్రం ఆలోచన. ఇప్పటికే కౌంటర్ నుంచి టికెట్ కొనుగోలు చేసి రైలెక్కే ప్రతి ఒక్కరి నుంచి 92 పైసలు వసూలు చేస్తూ, బీమా సదుపాయాన్ని కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణాలు కోల్పోతే రూ. 10 లక్షలు, ఆసుపత్రి ఖర్చులకు రూ. 2 లక్షలు, స్వల్ప గాయాలైతే రూ. 10 వేలు, సామాన్లు పోతే రూ. 5 వేలు బీమా పరిహారంగా అందుతుందన్న సంగతి తెలిసిందే.