: సోదరుడి మరణం నేపథ్యంలో.. న్యాయ మంత్రి సదానంద గౌడను తాకిన నోట్ల రద్దు ఇబ్బంది!
పాత నోట్ల రద్దు తరువాత ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడకు స్వయంగా తెలిసొచ్చింది. ఆయన సోదరుడు భాస్కర గౌడ, మంగళూరులోని కేఎంసీ వైద్యాలయంలో నిన్న కన్నుమూశారు. బిల్లు చెల్లించి మృతదేహాన్ని బయటకు తీసుకెళ్లాల్సి వుండగా, పాత నోట్లను సదానంద ఇవ్వజూపారు. ఆసుపత్రి సిబ్బంది ఆ నోట్లను స్వీకరించేందుకు ససేమిరా అనడంతో చేసేదేమీ లేక చెక్కిచ్చి బయటపడ్డారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రుల్లో పాత కరెన్సీలను తీసుకోవాల్సి వున్నప్పటికీ, ఇలా నిరాకరించడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు సదానంద తెలిపారు. వైద్యాలయం యాజమాన్యంపై చర్యలు తీసుకోనున్నట్టు స్పష్టం చేశారు.