: లోక్‌సభకు మోదీ వచ్చినప్పటికీ విపక్షాలు ఎందుకు చర్చకు సహకరించలేదు?: వెంకయ్య నాయుడు ఆగ్రహం
వాయిదా తరువాత ఈ రోజు 12 గంటలకు ప్రారంభమైన లోక్‌సభ కొనసాగుతోంది. మరోవైపు విపక్ష నేతల ఆందోళనతో రాజ్యసభ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది. విపక్ష సభ్యుల ఆందోళన, నినాదాల మధ్యే లోక్‌సభ కొనసాగుతోంది. లోక్‌సభ వాయిదా పడకముందు ఈ రోజు 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభకు హాజరయ్యారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు ఆందోళన చేయడంతో సభను వాయిదా వేయాల్సి వచ్చిన అంశంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను తరుచూ అడ్డుకోవాలనే విపక్ష నేతలు చూస్తున్నారని మండిపడ్డారు. పేదప్రజలు తమ పక్షాన ఉన్నారని, దేశ ప్రజలంతా పెద్దనోట్ల రద్దు అంశాన్ని సమర్థిస్తున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. లోక్‌సభకు ప్రధాని మోదీ హాజరయినప్పటికీ సభను అడ్డుకోవడంతో విపక్షనేతల ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. సభలో గందరగోళం సృష్టించడం ప్రతిపక్షాలకు ఒక అలవాటుగా మారిందని పేర్కొన్నారు. సభ సజావుగా సాగాలని ప్రజలు కోరుకుంటున్నారని వెంకయ్య వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల అంశంపై లోక్ సభలో వెంటనే చర్చ చేపట్టాలని ఆయన స్పీకర్ సుమిత్రా మహాజన్ ను కోరారు.